చైనా గ్రహాంతరవాసుల సంకేతాలను గుర్తించినట్టు ఈ రోజు సంచలన ప్రకటన చేసింది. చైనా ప్రభుత్వ అధీనంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ డైలీ ఈ ప్రకటన చేసింది. అనంతరం ఆ రిపోర్టును తొలగించింది. దీంతో నిపుణుల్లోనూ గందరగోళం ఏర్పడింది. రిపోర్టు తొలగించడానికి గల కారణాలు మాత్రం ఆ డైలీ వెల్లడించలేదు.
న్యూఢిల్లీ: చైనా ఈ రోజు సంచలన ప్రకటన చేసింది. ప్రభుత్వ పరిధిలోని సైన్స్ అండ్ టెక్నాలజీ డైలీ కీలక రిపోర్టును ప్రచురించింది. చైనా తమ భారీ టెలిస్కోప్ ఉపయోగించి భూగ్రహం బయట జీవులు ఉన్న సంకేతాలు గుర్తించినట్టు పేర్కొంది. అనంతరం, ఆ రిపోర్టును తొలగించింది. దీంతో నిపుణులు గందరగోళంలో పడిపోయారు. తమకు తొలిగా అందిన సిగ్నల్స్ ఇప్పుడు మారాయని, తమ బృందం ఇప్పుడు వాటినే పరిశీలిస్తున్నదని చీఫ్ సైంటిస్టు జాంగ్ టోంజీ వివరించారు. బీజింగ్ నార్మల్ యూనివర్సిటీ, నేషనల్ అస్ట్రనామికల్ అబ్జర్వేటరీ ఆఫ్ చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, యూఎస్ బర్కెలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలు సంయుక్తంగా స్థాపించిన ఎక్స్‌ట్రాటెర్రస్ట్రియల్ సివిలైజేషన్ సెర్చ్ టీమ్ చీఫ్ సైంటిస్టుగా జాంగ్ టోంజీ ఉన్నారు. అయితే, ఈ అనుమానాస్పద సిగ్నల్స్ ఓ రకమైన రేడియో ఇంటర్‌ఫెరెన్స్ కూడా కావొచ్చని ఆయన అన్నారు. ఈ విషయమై మరోసారి తాము ధ్రువీకరించుకోవాల్సి ఉన్నదని తెలిపారు. ఇది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ అని వివరించారు.
అయితే, చైనాకు చెందిన ఆ సంస్థ గ్రహాంతరవాసుల సంకేతాలకు సంబంధించిన రిపోర్టు ప్రచురించి తొలగించే లోపే పలువురు నిపుణులు, మీడియా ఔట్‌లెట్లు కథనాలు రాశాయి. చైనా సామాజిక మాధ్యమాల్లోనూ ఈ అంశం ట్రెండ్ అయింది. అనంతరం, ఆ రిపోర్టును తొలగించింది. ఆ రిపోర్టు తొలగించడానికి గల కారణాలను వెల్లడించలేదు.
ఇటీవలి కాలంలో గ్రహాంతర వాసులపై చర్చ పెరుగుతున్నది. నాసా ప్రత్యేకంగా యూఎఫ్‌వోలపై ప్రత్యేకంగా ఓ అధ్యయనం చేపట్టడానికి సిద్ధం అవుతున్నది. యూఎఫ్‌వోల గురించి ఏ మేరకు మనం అర్థం చేసుకోవాలి? ఏ నిర్ధారణకు రావాలనే విషయమై ఈ అధ్యయనం సాగనుంది.
అలాగే, సాధారణ ప్రజలూ గుర్తు తెలియని ఎగిరే వస్తువులను తాము చూశామన్న ఘటనలు పెరుగుతున్న సమయంలో ఈ రెండు సంస్థాలు అందుకు సంబంధించిన ప్రకటనలు చేయడం గమనార్హం. ముఖ్యంగా అమెరికాలో ఈ యూఎఫ్‌వోల గురించి చర్చ పెరిగింది. మిస్సోరీ రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితం ఓ మహిళ తాను ఆకాశంలో తేజవంతమైన ఓ గోళాన్ని చూశానని, అది చూసి తాను ఖంగుతిన్నానని చెప్పారు. ఆకాశంలో ఆ కదిలే యూఎఫ్‌వో సుమారు గంట సేపు కనిపించిందని పేర్కొన్నారు. గంటసేపు తమకు ఆ కాంతివంతమైన గోళం ఆకాశంలో కదులుతూ కనిపించిందని మెలిసా బేట్స్ తెలిపారు. ఆమె ఫ్రెండ్ కూడా ఇలాంటి గోళాన్నే చూసిన కొన్ని రోజుల తర్వాత మెలిసాకు కూడా కనిపించింది. ఇందుకు సంబంధించి ఆమె వీడియో రికార్డు కూడా చేయడం గమనార్హం.
