Asianet News TeluguAsianet News Telugu

రష్యా అధ్యక్షుడు పుతిన్ పై హత్యాయత్నం !

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​పై హత్యాయత్నం జరిగినట్లు ప‌లు అంత‌ర్జాతీయ వార్త సంస్థలు క‌థ‌నాల‌ను వెల్ల‌డిస్తున్నాయి. ఆయన ప్రయాణిస్తున్న కారుపై బాంబు దాడి జరిగినట్లు,ఆ ప్రమాదం నుంచి పుతిన్​కు సురక్షితంగా బయటపడిన‌ట్టు స‌మాచారం.

Vladimir Putin survives another assassination attempt
Author
First Published Sep 16, 2022, 6:25 AM IST

పుతిన్ కారుపై దాడి: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్దం జరుగుతున్న నేప‌థ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై హత్యాయత్నం జరిగినట్లు యూరో వీక్లీ న్యూస్ వెల్ల‌డించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కారుపై బాంబు దాడి జరిగింది. అయితే,  అతను తృటిలో ప్రాణాలతో బయటపడ్డార‌ని పేర్కొంది.

ప‌లు అంత‌ర్జాతీయ వార్త క‌థ‌నాల ప్రకారం.. పుతిన్ తన అధికారిక నివాసానికి తిరిగొస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు ముందు భాగంపై బాంబుదాడి జ‌రిగింద‌నీ, దీంతో.. పుతిన్ కారు ఎడమ చక్రం భారీ శబ్దంతో పేలిన‌ట్టు తెలుస్తుంది.  దీంతో అప్రమత్తమైన  బాంబు స్క్వాడ్,  బుల్లెట్ ప్రూఫ్ సెక్యూరిటీ ఫోర్స్ పుతిన్ కారు నుంచి పొగలు వస్తున్నప్పటికీ.. అధ్యక్షుడి వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారని, ఈ ఘటనలో పుతిన్‌ ప్రాణం తృటిలో తప్పిన‌ట్టు తెలుస్తుంది. 

పుతిన్ భద్రతలో భారీ లోపం

ఈ లోపానికి సంబంధించి పుతిన్ సెక్యూరిటీ సర్వీస్‌కు చెందిన పలువురిని అరెస్టు చేసినట్లు వర్గాలు తెలిపాయి. ఇది మాత్రమే కాదు, పుతిన్ ప్రయాణాలకు సంబంధించిన సమాచారం లీక్ అయినట్టు, దీంతో అతని ప‌లువురు బాడీ గార్డ్స్ ను తొలగించబడ్డారని తెలుస్తుంది.  

పుతిన్ వ్యతిరేక GVR టెలిగ్రామ్ ఛానెల్ మాత్రం భద్రతా బెదిరింపులను పేర్కొంటూ, సంఘటన జరిగిన సమయంలో పుతిన్ తన అధికారిక నివాసానికి బూటకపు భద్రతా స్క్వాడ్‌తో తిరిగి వస్తున్నారని పేర్కొంది. బ్యాకప్ కాన్వాయ్‌లో 5 సాయుధ కార్లు ఉన్నాయి, అందులో మూడవ కారులో పుతిన్ ఉన్నారని పేర్కొంది. 

ఇలాంటి క్లిష్ట సమయంలో పుతిన్‌పై దాడి జరిగింది. నివేదికల ప్రకారం, పుతిన్ కారును నియంత్రించడంలో సమస్య ఏర్పడింది. కానీ, సురక్షితంగా పుతిన్ ను సంఘటన స్థలం నుండి తీసుకువెళ్లారు. ఉక్రెయిన్ ఎదురుదాడిలో రష్యా సైన్యం తీవ్రంగా నష్టపోయిన సమయంలో పుతిన్‌పై దాడి జరిగింది. దీనిపై పుతిన్‌పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రష్యా ఆక్రమణ నుండి 6000 చ.కి.మీ ప్రాంతాన్ని మా దళాలు విముక్తి చేశాయని జెలెన్స్కీ పేర్కొన్నారు.

గతంలోనూ పలుమార్లు హత్యాయత్నం..

ఉక్రెయిన్‌పై  రష్యా యుద్దం ప్రారంభించినప్పటి నుంచి పుతిన్‌కు వ్యతిరేకత ఎదుర్కొవ‌ల్సి వ‌స్తుంది. ఈ క్రమంలోనే ఆయనపై ఈ దాడికి ప్ర‌య‌త్నాలు జ‌రిగాయ‌ని  పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
గ‌త నాలుగు నెల‌ల క్రితం కూడా పుతిన్‌పై దాడి జ‌రిగిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.  కాకసస్‌ పర్యటనలో ఉన్న సమయంలో పుతిన్‌పై దాడి జరిగిన‌ట్టు ఉక్రెయిన్‌ రక్షణశాఖ వర్గాలు వెల్లడించింది. ఇది కాకుండా.. పుతిన్ పై 2017లో ఓసారి దాడి జరిగిన‌ట్టు ఆయ‌నే స్వయంగా ప్రకటించారు. తనపై  ఐదు సార్లు హ‌త్యాయత్నాలు జరిగాయని, అయినా తాను వాటి గురించి ఎలాంటి ప‌రిస్థితుల్లో ఆందోళన చెందబోనని అప్పట్లో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పుతిన్‭పై దాడి జరుగుతున్నాయంటే.. ఆశ్చర్యంగానే ఉంది. గ‌తంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ విషయంలో కూడా ఇలా అనేక క‌థ‌నాలే వ‌చ్చాయి. ఆయా దేశాల్లో మీడియా..  ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి.. ఇలాంటి వార్త‌ల‌ను  అంత సులువుగా నమ్మడం క‌ష్ట‌మే.
 

Follow Us:
Download App:
  • android
  • ios