ఓ మహిళ తన బిడ్డ కోసం స్ట్రాలర్ కొనడానికి ఓ దుకాణానికి వెళ్లింది. అయితే... అక్కడికి వెళ్లాక ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. స్ట్రాలర్ ని కొనడం ఎందుకు కొట్టేస్తేపోలే అని అనుకుంది. వెంటనే తెలివిగా తన ప్లాన్ ని అమలుపరిచింది. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా స్ట్రాలర్ కొట్టేసింది. కానీ బయటకు వచ్చాక ఆమెకు అసలు విషయం అర్థమైంది. ఏంటంటే... స్ట్రాలర్ దొంగతనం చేసిన దుకాణంలోనే తన బిడ్డను మర్చిపోయానని. అంతే ఇక అక్కడి నుంచి దుకాణానానికి మళ్లీ పరుగులు తీసింది. కాగా... ఈఘటనంతా సీసీటీవీలో రికార్డు కాగా.. వీడియో వైరల్ అయ్యింది. ఈ సంఘటన న్యూజెర్సీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఓ మహిళ తన బిడ్డ, ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి న్యూజెర్సీలోని ఓ స్టోర్ కి వెళ్లింది. ఆమె స్నేహితురాళ్లు ఇద్దరూ షాప్ యజమానితో మాట్లాడుతుండగా... ఎవరూ చూడటం లేదని స్ట్రాలర్ ని దొంగతనం చేసి తెలివిగా బయటకు వచ్చేసింది. అయితే.. ఈ కంగారులో ఆమె తన బిడ్డను దుకాణంలోనే వదిలేసి  రావడం గమనార్హం. 

బిడ్డను దుకాణంలో మర్చిపోయామన్న విషయం తెలియని ఆమె స్నేహితురాళ్లు కూడా దుకాణం నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆమెకు తన బిడ్డను అక్కడ మర్చిపోయానన్న విషయం గుర్తుకు వచ్చింది. ఇంకేముంది పరుగున బిడ్డ కోసం దుకాణంలోకి పరుగులు తీసింది. ఆమె దొంగతనం చేయడాన్ని సీసీటీవీలో పసిగట్టిన దుకాణదారుడు... బిడ్డ కోసం వచ్చిన ఆమెను పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

ఈ వీడియోని ఆ దుకాణదారుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘‘స్ట్రాలర్ దొంగతనం చేయాలనే తొందరలో ఎవరి కోసమైతే ఆ దొంగతనం చేసారో వాళ్లనే ఇక్కడ వదిలి వెళ్లారు. దొంగతనం చేయడం వారి వ్యక్తిగత విషయం. కానీ ఇలా బిడ్డను మర్చిపోయి వెళ్లడం ఏమిటి..? వాళ్లకు బుద్ధి రావాలనే నేను వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నానంటూ ’’ అని క్యాప్షన్ పెట్టి వీడియో షేర్ చేశాడు. కాగా వీడియో వైరల్ గా మారింది.