వాషింగ్టన్: అమెరికాలోని ఇదాహోలో సోమవారం నాడు రెండు విమానాలు గాల్లోనే ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. గాల్లో ఢీకొన్న తర్వాత రెండు విమానాలు కోయర్ డీఅలెన్ సరస్సులో మునిగిపోయినట్టుగా స్థానిక అధికారులు ప్రకటించారు.ఈ ఘటనలో ఇప్పటికి రెండు మృతదేహాలను వెలికితీశారు.

చనిపోయిన వారిలో పిల్లలు, పెద్దవాళ్లు ఉన్నారని అధికారులు తెలిపారు. రెండు విమానాలు గాల్లో ఎలా ఢీకొన్నాయనే విషయమై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రెండు విమానాల శకలాలను సోనార్ సహాయంతో గుర్తించినట్టుగా అధికారులు ప్రకటించారు. వీటిని బయటకు తీయడానికి రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. 

ఈ ప్రమాదంలో సెస్నా 206 అనే విమానం ఉందని అధికారులు గుర్తించారు. మరో విమానాన్ని గుర్తించాల్సి ఉందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి ఇయాన్ గ్రేగర్ తెలిపారు.

ఎఫ్ఏఏ, జాతీయ రవాణా భద్రత బోర్డులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాయి. విమానాలు గాల్లో ఢీకొనే సమయంలో తాము చూసినట్టుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారని స్థానిక మీడియా ప్రకటించింది.