కాశ్మీర్ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మాట మార్చారు. కొద్దిరోజుల క్రితం భారత్-పాక్‌ల మధ్య తాను మధ్యవర్తిత్వం చేయనన్న ఆయన... మళ్లీ సిద్ధమంటూ తయారయ్యారు. భారత్, పాక్ ప్రధానులు మోడీ, ఇమ్రాన్ ఖాన్‌లతో ఫోన్‌ల మాట్లాడిన ఆయన ఆ తర్వాతి రోజే ఈ ప్రకటన చేశారు.

మంగళవారం ఎన్‌బీసీ న్యూస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ట్రంప్.... కాశ్మీర్ అంశం చాలా క్లిష్టమైనదని... అక్కడ హిందువులు, ముస్లింల మధ్య సంబంధాలు మంచిగా లేవన్నారు. పరిస్థితులు పూర్తిగా అదుపుతప్పక ముందే ఈ సమస్య పరిష్కారం కావాలన్నారు.

కాశ్మీర్‌‌లో శాంతి నెలకొనేందుకు అవసరమైన సాయం చేసేందుకు తాను సిద్ధమని ట్రంప్ పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.

భారత్, పాక్ ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖలు మాటల దాడికి దిగారు. దీంతో ఉద్రిక్తతలను తగ్గించేలా దాయాది దేశాలు సంయమనం పాటించాలంటూ ట్రంప్ మంగళవారం ఇరు దేశాధినేతలను కోరారు.

ముందుగా ప్రధాని మోడీతో మాట్లాడిన ట్రంప్....ఆ తర్వాత పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఫోన్ చేసి.. భారత్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడవద్దంటూ సుతిమెత్తగా హెచ్చరించారు. కాగా.. గత నెలలో ఇమ్రాన్ అమెరికాలో పర్యటించిన సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ... కాశ్మీర్‌ అంశంపై మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆ తర్వాత భారత్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. మళ్లీ తాజాగా ట్రంప్ మధ్యవర్తిత్వం వ్యాఖ్యలు చేయడం పట్ల ఇరు దేశాల్లో కలకలం రేగింది.