కాశ్మీర్ అంశంపై ప్రస్తుతం నెలకొన్ని పరిస్థితుల నేపథ్యంలో భారత్, పాక్ ప్రధానమంత్రులతో మాట్లాడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఇద్దరు నేతలతో చర్చించిన అంశాలను ట్విట్టర్‌లో తెలిపారు.

నాకు మంచి మిత్రులైన భారత ప్రధాని మోడీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో మాట్లాడాను... వాణిజ్య, ద్వైపాక్షిక, వ్యూహాత్మక భాగస్వామ్యంపై ప్రధానంగా చర్చించాం. ఉద్రిక్తతలను తగ్గించే దిశగా చర్చలు సాగాయని ట్రంప్ ట్వీట్ చేశారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం ట్రంప్‌తో మోడీ ఫోన్‌లో మాట్లాడారు. ఇమ్రాన్ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని... ఆయన ఉపయోగిస్తున్న పదజాలం ప్రాంతీయంగా శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లే అవకాశం వుందన్నారు.

మోడీ వ్యాఖ్యలపై స్పందించిన ట్రంప్.. కొద్దిగంటల్లోనే ఇమ్రాన్ ఖాన్‌కు ఫోన్ చేశారు. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కాశ్మీర్‌పై ఆచితూచి మాట్లాడాలని సూచించిన సంగతి తెలిసిందే.