అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. మొన్న కాస్త తగ్గినట్లే కేసులు అనిపించినా.. మళ్లీ తిరగపెట్టింది. కేవలం అమెరికాలో 50వేల కరోనా మరణాలు సంభవించాయి. అక్కడ ఇప్పటి వరకు 8.5లక్షల మందికి కరోనా సోకింది. గురువారం ఉదయం నాటికి దాదాపు 50వేల కరోనా మరణాలు నమోదు కాగా.. నేటితో 50వేలు దాటాయని అక్కడి అధికారులు చెబుతున్నారు.

గురువారం మరో 2,416 మంది వైర్‌సతో చనిపోయారు. దీంతో వరుసగా మూడో రోజూ 2 వేల మంది పైనే ప్రాణాలు కోల్పోయినట్లైంది. అయితే, ఒక్కో రాష్ట్రం క్రమంగా కోలుకుంటోందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. 

కరోనా రూపంలో అమెరికాపై దాడి జరిగింద తీవ్ర వ్యాఖ్య చేశారు. భారీ ఉద్దీపన పథకం నేపథ్యంలో రుణభారం పెరిగిపోతుండటంపై మీడియా ప్రశ్నకు బదులిస్తూ.. ‘మనం దాడికి గురయ్యాం. ఇది కేవలం ఫ్లూ కాదు. 1917 తర్వాత ఇలాంటిది ఎవరూ చూడలేదు’ అని అన్నారు. 

‘చైనా సహా ఎవరికీ లేనంతటి,  అతి గొప్ప ఆర్థిక వ్యవస్థ మనది. మూడేళ్లుగా దీనిని మనం నిర్మించుకున్నాం. అకస్మాత్తు దెబ్బ నుంచి కోలుకునేందుకు కొంత డబ్బు వెచ్చించక తప్పదు’ అని ట్రంప్‌ విశ్లేషించారు. 

ఇదిలా ఉండగా..  అమెరికాలోకి వలసలను 60 రోజుల పాటు నిలిపివేస్తూ జారీచేసిన ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం చేశారు. అమెరికన్లు కోల్పోయిన ఉద్యోగాలు వలసదారులతో భర్తీ కావడం సరికాదని అన్నారు. ట్రంప్‌ చర్యను సవాల్‌ చేస్తానని న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ లెటీటియా జేమ్స్‌ ప్రకటించారు. ఈ పరిణామాలతో మనపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నామని భారత్‌ తెలిపింది.