జూమ్ వీడియో కాల్ లైవ్ లో ఓ వ్యక్తి కన్న తండ్రిని అతి కిరాతకంగా హత్య చేశాడు. కాగా.. ఆ హత్యను లైవ్ లో చూసిన వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణ సంఘటన వాషింగ్టన్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

మిటీవిల్లేలోని సౌత్ ఓక్స్ హాస్పిటల్ సమీపంలో నివాసం ఉంటున్న డ్వైట్‌ పవర్స్‌(70) గురువారం తన స్నేహితులతో జూమ్‌ యాప్‌లో వీడియో చాట్‌ చేస్తున్నాడు. ఈ సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన డ్వైట్‌ పవర్స్‌ కొడుకు స్కల్లీ పవర్స్‌(32) కత్తితో తండ్రిపై దాడి చేసి చంపేశాడు. 

జూమ్‌ వీడియో చాట్‌లో ఉన్న డ్వైట్‌ స్నేహితులు ఈ దారుణాన్ని ప్రత్యక్షంగా చూశారు. వెంటనే పోలీసులకు ఫోన్‌ చేశారు. అయితే పోలీసులు వచ్చే లోపే స్కల్లీ అక్కడి నుంచి పరారయ్యాడు. కానీ గంటల వ్యవధిలోనే స్కల్లీని అరెస్ట్‌ చేశారు పోలీసులు. తండ్రికొడుకుల మధ్య అసలేం జరిగింది..ఎందుకు స్కల్లీ తండ్రిని చంపాల్సి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.