కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. చైనాలోని వుహాన్ లొ పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు పాకేసింది. దీని ప్రభావం అమెరికాలో చాలా ఎక్కువగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో దాదాపు 40శాతం అమెరికాలోనే నమోదు కావడం గమనార్హం. ఇప్పటికే అమెరికాలో 14లక్షల కేసులు నమోదు కాగా.. 80వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి.

కాగా.. అమెరికాకి ఈ కరోనా వైరస్ కారణంగా భవిష్యత్తులో అతి పెద్ద ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కోవిడ్‌-19 క‌ట్ట‌డికి ఎన్ని క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్న ఫ‌లితం లేకుండా పోతోంది. రోజురోజుకి శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న ఈ మ‌హ‌మ్మారి వ‌ల్ల యూఎస్‌లో ప్ర‌తిరోజు భారీ సంఖ్య‌లో పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్నాయి. 

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ కుదేల్ కావ‌డంతో నిరుద్యోగిత కూడా పెరిగిపోతోంది. ఇదిలాఉంటే... వ‌చ్చే శీతాకాలం ముందే ఈ వైర‌స్ వ్యాప్తిని నియంత్రించ‌క‌పోతే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని ప్ర‌త్యేక‌ ప్ర‌తినిధి రిక్ బ్రైట్ అన్నారు. క‌రోనా క‌ట్ట‌డి విష‌య‌మై సంసిద్ధత గురించి ఆందోళన వ్యక్తం చేసినందుకు బయోమెడికల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ డైరెక్టర్‌గా తనను తొలగించినట్లు బ్రైట్ పేర్కొన్నాడు.

"ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో మ‌నం ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్న చాలా జాగ్ర‌త్త‌గా ఆలోచించి తీసుకోవాలి. దీని కోసం వైద్య నిపుణుల స‌హాయం తీసుకోవ‌డం చాలా అవ‌సరం. ఈ స‌మ‌యంలో ఆచితూచి అడుగు వేస్తేనే.. అనుకున్న ల‌క్ష్యాల‌ను చేరుకోగ‌లం. సైన్స్ ఆధారంగా ఇప్పుడు మన ప్రతిస్పందనను మెరుగుపరచడంలో విఫలమైతే... మహమ్మారి మరింత విస్త‌రించ‌డంతో పాటు దీర్ఘకాలం ఉంటుందని నేను భయపడుతున్నాను." అని బ్రైట్ తెలిపాడు. కోవిడ్‌-19 విష‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకోక‌పోతే.. వ‌చ్చే శీతాకాలం అమెరికాలో అంధ‌కార‌మేన‌ని ఆయ‌న చెప్పారు.