వాషింగ్టన్: కరోనా విషయంలో చైనాపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న అమెరికాడ్రాగన్ పై కఠిన చర్యలకు ఉపక్రమించాలని భావిస్తోంది. చైనా దుందుడుకు వైఖరికి తగిన సమాధానం చెప్పేందుకు సిద్దమౌతోంది అమెరికా. ఈ విషయమై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కేలే మెకానీ బుధవారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు.

సరైన సమయంలో చైనాపై తీసుకోనున్న చర్యలపై కొన్ని రోజుల్లోనే ఓ వినబోతున్నారని ఆయన చెప్పారు. చైనాపై ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో ఇప్పుడే చెప్పలేమన్నారు. 

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కరోనాతో అమెరికా అతలాకుతలమౌతోంది. కరోనా కేసుల్లో ప్రపంచంలోనే అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. అమెరికాలో 30 లక్షల మందికి కరోనా సోకింది. ఇప్పటికే లక్షన్నర మంది మరణించారు. 

గత కొన్ని నెలలుగా అమెరికా- చైనాల మధ్య వాణిజ్య యుద్ధం నెలకొంది. ఈ తరుణంలో  ప్రపంచ వాణిజ్య ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా పేరొందిన హాంకాంగ్‌ను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్న డ్రాగన్‌పై అగ్రరాజ్యం గుర్రుగా ఉంది. హాంకాంగ్‌ స్వయంప్రతిపత్తిని రద్దు చేసేలా చైనా అక్కడ ప్రవేశపెట్టిన జాతీయ భద్రతా చట్టంపై విరుచకుపడింది. 

అమెరికా జర్నలిస్టులపై ఆంక్షలు, ఉగర్‌ ముస్లింల పట్ల చైనా వ్యవహరిస్తున్న తీరు, టిబెట్‌పై డ్రాగన్‌ విధానం తదితర అంశాలపై కూడా అగ్రరాజ్యం ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై వైట్‌హౌజ్‌ ప్రెస్‌ సెక్రటరీ కేలే మెకానీ బుధవారం స్పందించారు. 

అయితే ఇటీవల వైట్‌హౌజ్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌, జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓ బ్రెయిన్‌ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో చేస్తున్న వ్యాఖ్యల గురించి స్పందించేందుకు కేలె నిరాకరించారు.