అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ను అధికారికంగా ప్రకటించింది కాంగ్రెస్. జనవరి 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ను ప్రకటించింది.

ఎలక్టోరల్ ఓట్ల ఆధారంగా ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ .. బైడెన్ పేరును అధికారికంగా ప్రకటించారు. మొత్తం ఎలక్టోరల్‌లో జో బైడెన్‌కు 306 ఓట్లు రాగా, ట్రంప్‌కు 232 ఓట్లు వచ్చాయి.

చివరి క్షణం వరకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఎట్టకేలకు ఓటమిని అంగీకరించారు ట్రంప్. జనవరి 20న జో బైడెన్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు చెప్పారు. అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనంతగా తన పాలన అద్భుతంగా సాగిందన్నారు ట్రంప్.

అంతకు ముందు యూఎస్ కాంగ్రెస్‌లో హైడ్రామా జరిగింది. కేపిటల్ భవనంపై ఆందోళనకారులు దాడి చేశారు. దాంతో బయటకు వెళ్లిన సభ్యులు తిరిగి భారీ భద్రత మధ్య సభకు వచ్చారు. ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేశారు.

అర్ధాంతరంగా ఆగిన ఓటింగ్ ప్రక్రియను హౌస్ స్పీకర్ నాన్సి పెలోసీ పున: ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆందోళనకారుల చర్యను అమెరికా ప్రజాస్వామ్య మూల స్తంభాలపైన దాడిగా అభివర్ణించారు పలువురు  కాంగ్రెస్ సభ్యులు.

అధికార మార్పిడి ప్రక్రియను పూర్తి చేయడంతో దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపైన ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో తప్పుడు పద్ధతుల్ని అనుసరించారంటూ వాళ్ల నాయకుడు పదే పదే చెప్పడం వల్లే వాళ్లంతా దాడికి తెగబడ్డారంటూ సెనేట్, ప్రతినిధుల సభ ఉమ్మడి సమావేశంలో ఎండగట్టారు.