యూఏఈలో UPI, RuPay కార్డ్ సేవలు.. అట్టహాసంగా ప్రారంభించిన మోడీ, మొహమ్మద్ బిన్ జాయెద్ (వీడియో)
ప్రధాని నరేంద్ర మోడీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌లు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ), రూపే కార్డ్ సేవలను గురువారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రవేశపెట్టారు.
ప్రధాని నరేంద్ర మోడీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌లు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ), రూపే కార్డ్ సేవలను గురువారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రవేశపెట్టారు. రూపే అనేది భారతదేశానికి చెందిన మల్టీనేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ , పేమెంట్ సర్వీస్ సిస్టమ్. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌ను వాడుక భాషలో యూపీఐ అని పిలుస్తారు. ఇది భారత్‌లో తక్షణ చెల్లింపు వ్యవస్థ.
యూఏఈలో యూపీఐ, రూపే కార్డ్ సేవలను ప్రారంభించే ముందు పీఎం నరేంద్ర మోడీ, ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్‌లు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. వీరి సమక్షంలో అనేక అవగాహనా ఒప్పందాలను ఇరుదేశాల అధికారులు పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు. ద్వైపాక్షిక చర్చలకు హాజరైన భారతీయ ప్రతినిధి బృందంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా వున్నారు.
అంతకుముందు యూఏఈ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి మహమ్మద్ బిన్ జాయెద్ స్వాగతం పలికారు. ఇద్దరు నేతలు కరచాలనం చేసుకుని ఒకరినొకరు కౌగిలించుకున్నారు. అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లో తనను రిసీవ్ చేసుకునేందుకు సమయాన్ని వెచ్చించినందుకు తన సోదరుడు బిన్ జాయెద్‌కు కృతజ్ఞతలు అంటూ మోడీ ట్వీట్ చేశారు. భారత్ యూఏఈ మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేసే ఉత్పాదక పర్యటన కోసం తాను ఎదురుచూస్తున్నానని ప్రధాని ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈరోజు అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. రేపు అబుదాబిలో బీఏపీఎస్ హిందూ దేవాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అబుదాబిలో నిర్మించిన మొదటి హిందూ దేవాలయం ఇదే..