Asianet News TeluguAsianet News Telugu

పాకిస్తాన్‌లో అస్థిరత, పౌర అశాంతి.. పర్యవసానాలు భారత్ పైనా!

పాకిస్తాన్‌లో పీటీఐ అధినేత, మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పౌర అశాంతి నెలకొంది. దేశమంతటా ఆందోళనలు కమ్ముకునే పరిస్థితి ఉన్నది. రాజకీయ అస్థిరత ఏర్పడి, అధికారాన్ని మిలిటరీ లేదా.. తీవ్రవాదులు చేపట్టే ముప్ప ఉంది. ఫలితంగా దాని పర్యవసానాలు ఈ రీజియన్ పైనా ముఖ్యంగా భారత్ పై పడే అవకాశాలు ఉంటాయి.
 

unstable civil unrest in pakistan could have implications for india kms
Author
First Published May 10, 2023, 6:17 PM IST

న్యూఢిల్లీ: అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత ఆ దేశంలో పౌర అశాంతి నెలకొంది. పీటీఐ మద్దతుదారులు ఏకంగా పోలీసులతోనే ఘర్షణకు దిగారు. దేశమంతటా అశాంతి నెలకొనడంతో యూకే, యూఎస్, కెనడా వంటి దేశాలు ప్రయాణికులపై ఆంక్షలు విధించారు. ఈ ఏడాది చివరిలో పాకిస్తాన్ జాతీయ ఎన్నికలు జరగాల్సిన తరుణంలో ఆ దేశ భవిత గాడి తప్పుతున్నదనే ఆందోళనలు వెలువడుతున్నాయి.

అల్ ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసింది. ఓ ప్రాపర్టీ టైకూన్‌తో పీటీఐ ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ఖజానాకు 190 మిలియన్ పౌండ్ల నష్టాన్ని కలుగజేసిందనేది ఆరోపణ.

ఈ ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు, అనుచరులు దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు ఇస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్‌ను దోషిగా తేల్చితే ఈ ఏడాదిలో జరగనున్న జాతీయ ఎన్నికల్లో నుంచి తప్పించవచ్చునని ప్రత్యర్థులు కుట్ర చేస్తున్నారని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. పరువునష్టం, తీవ్రవాదం, అవినీతి వంటి తీవ్ర ఆరోపణలను పీటీఐ ఎదుర్కొంటున్నది.

ఓ పీటీఐ మాజీ కార్యకర్త తీవ్ర ఆరోపణలు చేశారు. వైఫల్యాలకు బాధ్యతను ఇతరులపైకి నెట్టేసే దురలవాటు ఇమ్రాన్ ఖాన్‌కు ఉన్నదని, ఆ పార్టీ ఒక కుటుంబ పార్టీగా మారిందని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ తన సిస్టర్స్, బావలకు పార్టీలో ముఖ్యమైన పదవులు అప్పజెప్పారని విమర్శించారు.

ఇదిలా ఉంటే.. ఇమ్రాన్ ఖాన్ అరెస్టు పర్యవసానాలు పాకిస్తాన్ ప్రజాస్వామ్యంపై పడనున్నాయి. న్యాయవ్యవస్థ స్వతంత్ర, అవినీతి అరికట్టడానికి ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిపై అనుమానాలు వస్తున్నాయి. పాకిస్తాన్ చరిత్ర పొడగునా రాజకీయ అస్థిరత, తిరుగుబాట్లు కనిపిస్తాయి. అయితే, నేటి పరిస్థితులు  ఆ దేశ ప్రజాస్వామిక సంస్థలను మరింత బలహీనం చేసే ప్రమాదం ఉన్నది. అందుకే సంక్షోభం నుంచి బయటపడటానికి శాంతియుతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. పాకిస్తాన్ నేతలు కూడా ఈ అస్థిరతకు, ఆందోళనలకు గల కారణాలను కనుగొని పరిష్కరించాల్సి ఉంది.

పారామిలిటరీతో ఘర్షణలు ఇమ్రాన్ ఖాన్‌కే ముప్పుగా మారే అవకాశాలున్నాయి. ఆయన పొలిటికల్ కెరీర్, జీవితానికే ముప్పు ఏర్పడుతుంది. పాకిస్తాన్‌లో మిలిటరీ శక్తివంతమైనది. దానిపై పైచేయి సాధించాలనే ప్రయత్నంలో మిలిటరీకి, ఇమ్రాన్ ఖాన్‌కు మధ్య పొరపొచ్చాలు వచ్చాయి.

ఇమ్రాన్ ఖాన్ పాలన వివాదాలు, విభజనలతో మిళితమైంది. ఆయన వ్యాఖ్యలు, విధానాలు చర్చనీయంశమయ్యాయి. కొందరేమో ఆయనను మార్పుకు సూచికగా పేర్కొంటే ఇంకొందరు ప్రజాదరణ కోసం ఎంతకైనా తెగించే నేతగా భావిస్తారు. రాజకీయ ప్రత్యర్థులు, మీడియాపట్ల ఆయన వైఖరి ప్రజాస్వామిక సూత్రాలను, భావ ప్రకటన స్వేచ్ఛను హరించేవిగా కనిపించాయి. సున్నితమైన మహిళల హక్కులు, మతపరమైన మైనార్టీలు, మత మార్పిడి చట్టాలు తీవ్రమైన చర్చను లేవదీశాయి.

ఇప్పుడు పాకిస్తాన్ నిలువునా చీలిపోయి ఉన్నది. ఇమ్రాన్ ఖాన్ ప్రజాదారణ ఎజెండా దేశ సమస్యలకు అదనంగా తోడైంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేదరికంతోపాటు రాజకీయ అవినీతి, ఆర్థిక అస్థిరత, మతపరమైన అతివాదాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

పాకిస్తాన్‌లోని ఈ పరిస్థితుల పర్యవసానాలు భారత్ పైనా పడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషణలు వస్తున్నాయి. పాకిస్తాన్‌లో ఘర్షణలు పెరిగితే.. సుదూరమైన సరిహద్దును పంచుకుంటున్న భారత్‌ సెక్యూరిటీపైనా ఆందోళనలు వస్తాయి. గతంలోనూ ఈ రెండు దేశాల మధ్య మిలిటరీ పోరాటాలు జరిగాయి.

పాకిస్తాన్‌లోని రాకీయ అస్థిరత ఈ రీజయిన్ స్థిరత్వంపైనా ప్రభావం వేసే ముప్పు ఉంటుంది. దీని ఫలితంగా ఇండియాలోనూ బలమైన ప్రభావం వేసే అవకాశం ఉంది. ఈ పౌర అశాంతితో ప్రభుత్వం కుప్పకూలితే అక్కడ రాజకీయ శూన్యత ఏర్పడి తీవ్రవాదులకు అవకాశం కల్పించినట్టు అవుతుంది. ఫలితంగా ఈ రీజియన్‌లో భద్రతా, స్థిరత్వంపై నీలినీడలు కమ్ముకుంటాయి. అంతేకాదు, పాకిస్తాన్‌లోని న్యూక్లియర్ వ్యవస్థలు కూడా తప్పుడు చేతుల్లోకి వెళ్లే ముప్పు ఉంటుంది.

పాకిస్తాన్‌లోని ప్రస్తుత అశాంతి పాకిస్తాన్, ఇండియా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలపైనా ప్రభావం వేయవచ్చు. ఈ రెండు దేశాల మధ్య ఇప్పటికే ఈ సంబంధాలు దిగజారాయి. మరింత క్షీణిస్తే.. ఉభయ దేశాల్లో వ్యాపారం చేసే వారికి ఆటంకాలు తప్పవు.

 

-- అర్షియా మాలిక్ (ఇస్లాంపై విమర్శనాత్మక ఆలోచనలున్న ఈ వ్యాసకర్త ముస్లిం ప్రపంచంలో ‘మూగబోయిన గొంతులు’పై పరిశోధనలు చేస్తున్నారు.)

Follow Us:
Download App:
  • android
  • ios