ఉక్రెయిన్ యుద్ధ విమానాన్ని గగన వీధుల్లో ఉరకలెత్తించి శత్రు విమానాలను తరిమేసిన ఘనుడు. యుద్ధం మొదలైన తొలిరోజే ఆరు విమానాలను నేలకూల్చిన ఉక్రెయిన్ వార్ హీరో మరణించాడు. రష్యాకు చెందిన సుమారు 40 యుద్ధ విమానాలను కూల్చేసిన ఆ హీరోను అక్కడి ప్రజలు ఘోస్ట్ ఆఫ్ కీవ్‌గా పిలుచుకుంటారని ఉక్రెయిన్ ప్రభుత్వం ఓ ట్వీట్‌లో తెలిపింది.
న్యూఢిల్లీ: అరవీర భయంకరుడు. తాను యుద్ధంలోకి దిగాడంటే ప్రత్యర్థుల ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. యుద్ధ విమానం గాల్లోకి ఎగిరించాడంటే.. అది చూపును మోసం చేస్తూ ఊహకు అందకుండా ఆకాశంలో గింగిరాలు తిరగాల్సిందే. ఆయన కదనరంగంలో కాలుమోపాడంటే ఉక్రెయిన్ వైమానిక దళానికి ఊపిరి అందినట్టు అవుతుంది. అందుకే ప్రత్యర్థుల పాలిట ఆయన ఘోస్ట్ ఆఫ్ కీవ్. ఉక్రెయిన్‌కు మాత్రం ఆయనో వార్ హీరో. శత్రువు వెన్నులో వణుకు పుట్టించిన ఆ హీరో వివరాలు ఇప్పటి వరకూ గోప్యంగానే ఉంచారు.
కానీ, గత నెలలో ఆయన తనకు అప్పజెప్పిన మిషన్ సక్సెస్ చేస్తూ నేలపై కుప్పకూలిపోయాడు. తన తుది శ్వాస స్వదేశం కోసం పోరాడుతూనే విడిచాడు. అందుకే ప్రభుత్వం ఆయనను ఘనంగా స్మరించింది. ఆయన మరణం తర్వాత ఇప్పుడు ఆయన వివరాలను ఉక్రెయిన్ ప్రభుత్వం బహిర్గతం చేసింది.
ఉక్రెయిన్‌పై రష్యా ఫిబ్రవరి 24న యుద్ధం ప్రారంభించింది. ఈ యుద్ధంలో మన ఘోస్ట్ ఆఫ్ కీవ్ సుమారు 40 యుద్ధ విమానాలను నేలకూల్చాడు. రష్యా వైమానిక దళానికి ఆయన ఒక పీడకలగా మారాడు. ఆయన పేరు మేజర్ స్టెపాన్ తారాబల్కా (29) అని ఉక్రెయిన్ ప్రభుత్వం రివీల్ చేసింది. మార్చి 13వ తేదీన ఈ వార్ హీరో మరణించాడు. గగనపు వీధిలో చుట్టూ శత్రు విమానాలు మోహరించి తాను ఆపరేట్ చేస్తున్న మిగ్-29 యుద్ధ విమాన్ని దాడి చేసి నేలకూల్చాయి.
యుద్ధం మొదలైన తొలి రోజే ఆరు రష్యా విమానాలను నేలకూల్చిన మేజర్ స్టెపాన్ తారాబల్కాను గార్డియన్ ఏంజిల్ అంటూ ఉక్రెయిన్ కీర్తించింది. అప్పుడు ఆయన ఐడెంటిటీ ఇంకా రహస్యంగానే ఉన్నది. ప్రజలు ఆయనను ఘోస్ట్ ఆఫ్ కీవ్‌గా పిలుచుకుంటారని ఉక్రెరయిన్ ప్రభుత్వం ఓ ట్వీట్‌లో తెలిపింది. ఉక్రెయిన్ రాజధాని, దేశ గగనతలాన్ని రక్షించడంలో ఆయన పాత్ర అమోఘం అని వివరించింది. ఇప్పటికే ఈయన రష్యా యుద్ధ విమానాలకు పీడకలగా ఉన్నాడని తెలిపింది.
మేజర్ తారాబల్కా సేవలను గుర్తించి ఉక్రెయిన్ ప్రభుత్వం ఆయనకు యుద్ధ రంగంలో టాప్ మెడల్ ది ఆర్డర్ ఆప్ ది గోల్డెన్ స్టార్‌ను మరణానంతరం ఆయనకు ప్రకటించింది.
మేజర్ తారాబల్కాకు ఒలేనియా పేరుగల భార్య, ఎనిమిదేళ్ల కొడుకు యరిక్ ఉన్నాడు. తారాబల్కా పశ్చిమ ఉక్రెయిన్‌లో కొరొలివ్కా అనే మారుమూల కుగ్రామంలో వర్కింగ్ క్లాస్ కుటుంబంలో జన్మించాడు. చిన్నపిల్లాడుగా ఉన్నప్పటి నుంచే స్టెపాన్ తారాబల్కాకు పైలట్ కావాలనే దృఢమైన కోరిక ఉండింది.
కాగా, మేజర్ తారాబల్కా కుటుంబం మాత్రం తమ కుమారుడు మరణానికి సంబంధించిన వివరాలను ఉక్రెయిన్ ప్రభుత్వం తమకు ఇవ్వలేదని ఆరోపించింది. ఆయన యుద్ధ విమానాలు నడుపుతున్నాడని తమకు తెలుసు అని, ఆయన ఆ మిషన్‌ను కూడా పూర్తి చేశాడని తెలుసు అని చెప్పారు. కానీ, ఆయన తిరిగి రాలేదని అధికారులు చెప్పారని, అంతకు మించి మరే విషయం తమకు తెలియజేయలేదని తారాబల్కా తండ్రి ఎవోన్ మీడియాకు వివరించారు.
కాగా, ఘోస్ట్ ఆఫ్ కీవ్ అనే పాత్ర నిజమేనా? అనే అనుమానాలు కూడా చాలా మందిలో ఉన్నారు. ఇది కేవలం ఉక్రెయిన్ సైనికుల్లో ధైర్యం నూరిపోయడానికి సృష్టించిన పాత్రనా? అనే సంశయాలు కూడా ఉన్నాయి. తారాబల్కా తల్లిదండ్రులకూ ఈ కోవర్ట్ ఆపరేషన్ గురించిన సమాచారం లేదు. కేవలం ఆయన మరణించిన తర్వాతనే ఈ విషయాన్ని వారికి తెలిసింది.
