Russia Ukraine Crisis: రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, రష్యా తన తీరును మార్చుకోవాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మానవ విషాదాన్ని క్రియేట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
North Atlantic Treaty Organization: రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాని ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధం ఆపాలని ఐరాసతో పాటు చాలా దేశాలు కోరుతున్నాయి. అయితే, ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ లోని పెద్ద సంఖ్యలో సైనిక స్థావరాలను ధ్వంసం చేయడంతో పాటు సైనిక బలగాలు కీవ్ నగరంలోకి ప్రవేశించాయి. రష్యా మొదలు పెట్టిన ఈ మిలిటరీ చర్య కారణంగా రెండు దేశాల్లో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిందని తెలుస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ లో మరణాలు, ఆర్థిక నష్టం తీవ్రత పెరుగుతున్నదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ చర్యలను ఆపాలని ప్రపంచ దేశాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే అమెరికా సహా నాటో కూటమిలోని చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ రష్యా ఏమాత్రం లెక్కచేయడం లేదు. ఈ క్రమంలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. రష్యా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూరోప్‌లో మళ్లీ యుద్ధం మొదలైందని, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ యుద్ధాన్ని కాంక్షించారని, మానవ విషాదాన్ని ఆయన క్రియేట్ చేస్తున్నారని మాక్రాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఉక్రెయిన్ ప్రజలకు యూరప్ దేశాలు అండగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగియదన్నారు. చాలా సుదీర్ఘమైన యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలన్నారు. నాటోలో కీలక దేశమైన ఫ్రాన్స్ ఇవాళ ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందిస్తున్నట్లు కూడా మాక్రాన్ వెల్లడించారు.
కాగా, రష్యాపై తమ దేశ సైనిక వ్యూహం గురించి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో తాను మాట్లాడానని, ఉక్రెయిన్ తన భాగస్వాముల నుండి ఆయుధాలు మరియు సామగ్రిని త్వరలో అందుకోనున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆయన వివరాలు పంచుకున్నారు.
ఇదిలావుండగా, ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యాకు కూడా భారీ నష్టమే జరిగిందని తెలుస్తోంది. ఇప్పటి వరకు సుమారు 3500 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ బలగాలు తమ ఫేస్‌బుక్ పేజీలో పేర్కొన్నాయి. అలాగే, మరో 200 మంది రష్యా సైనికుల్ని బందించినట్టు తెలిపింది. దీనికి తోడు 14 విమానాలను, 8 హెలికాప్టర్లను, 102 యుద్ధ ట్యాంక్‌లను కూడా రష్యా కోల్పోయినట్లు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ లో సైనికులతో పాటు సామాన్య ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యా దాడుల్లో 198 పౌరులు మృతిచెందగా.. దాదాపు 1200 మంది తీవ్రంగా గాయపడ్డారు.
