ఉక్రెయిన్‌లో రష్యాకు చెందిన ఆర్మీ కాన్వాయ్ ఒక చోట నుంచి మరో చోటుకు వెళ్తుండగా ఓ ఉక్రెయిన్ పౌరుడు వాటిని స్వయంగా ఒంటరిగానే ఆపాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆ భారీ ఆర్మీ కాన్వాయ్‌కు అడ్డుగా రోడ్డుపై వెళ్లి నిలిచాడు. దీంతో ఒక్కసారిగా ఆ వాహనాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత వెంటనే ఆయన పక్క నుంచి వాహనాలు వెళ్లిపోయాయి. అయినా.. ఆ వ్యక్తి ఊరుకోలేదు.
న్యూఢిల్లీ: ఉపద్రవాలు ఎదురైనప్పుడు, యుద్ధాలు(War) ముందుకు వచ్చినప్పుడు సామాన్యుడు అసాధారణమవుతూ ఉంటాడు. కండలు తిరిగి, అధునాతన ఆయుధ వాహనాలు మింగేందుకు వస్తున్నా.. ఒక్కోసారి ఆ సామాన్యుడు ఇసుమంతైనా చలించడు. రొమ్ము చరిచి నిబ్బరంగా గుండెను ఎదురేస్తడు. ఇప్పుడు ఉక్రెయిన్‌లో పరిస్థితులు క్షణాలను లెక్కపెట్టుకునేలా ఉన్నాయి. ఎక్కడ ఆకాశం నుంచి క్షిపణులు పిడుగై పడతాయో.. ఏ క్షణంలో ఆప్తులు ఆవిరైపోతారో అనే భయాందోళనల్లో ప్రజలు ఉన్నారు. ఈ స్థితిలో ఉక్రెయిన్‌లో ఓ సామాన్యుడి అసామాన్య ధైర్యానికి సంబంధించిన ఉదాహరణ ఒకటి వెలుగులోకి వచ్చింది. నెటిజన్లు ఆ వీడియోను చూసి ఫిదా అయిపోతున్నారు. ఆ ఉక్రెయిన్ (Ukraine) పౌరుడి సాహసానికి, ధైర్యానికి సలామ్‌లు కొడుతున్నారు. రష్యా(Russia) తీరును ఎండగడుతున్నారు.
రష్యా ఆర్మీ ఉక్రెయిన్‌పై దాడులు ప్రారంభించి నేటితో మూడో రోజులోకి ఎంటర్ అయింది. ఇప్పటికీ భీకర దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ మిలిటరీ స్థావరాలపై దాడులు చేపడుతూనే ఉన్నది. కాగా, ఉక్రెయిన్ కూడా ప్రతిదాడి చేస్తున్నది. ఈ దాడుల నేపథ్యంలో రష్యా బలగాలు పెద్ద మొత్తంలో ఉక్రెయిన్‌లోకి ప్రవేశించాయి. నిన్న రాజధాని నగరంలోకి వచ్చినట్టు వార్తలు వచ్చాయి. పెద్ద పెద్ద ఆర్మీ వాహనాల్లో మిలిటరీ, ఆయుధ సామాగ్రి రష్యా నుంచి ఉక్రెయిన్‌లోకి వస్తున్నాయి.
ఇలాగే రష్యా సేనలు భారీ ఆర్మీ కాన్వాయ్‌లో ఉక్రెయిన్‌లో ప్రవేశిస్తున్నాయి. వీటిని అడ్డుకోవడానికి ఉక్రెయిన్ ప్రయత్నాలు సఫలం కావడం లేదు. ఇదిలా ఉండగా ఓ ఉక్రెయిన్ పౌరుడు స్వయంగా ఆర్మీ కాన్వాయ్‌కు అడ్డంగా వెళ్లాడు. రోడ్డుపై వరుసగా వస్తున్న ఆర్మీ వాహనాలను అడ్డుకోవాలని ఆయన ప్రయత్నించాడు. ప్రాణాలు పోతాయన్న భయమే లేకుండా ఆయన నేరుగా ఆర్మీ కాన్వాయ్‌కు అడ్డంగా వెళ్లి వాటిని ఆపే ప్రయత్నం చేశాడు. కాన్వాయ్ నుంచి ఒక వాహనం ఆయన అడ్డురావడంతో పక్కకు వచ్చి ఆగిపోయింది. కానీ, ఆ తర్వాత వెంటనే ఆ వ్యక్తి పక్క నుంచి వెళ్లిపోయింది. కాన్వాయ్‌లోని మిగతా వాహనాలూ ఆ వాహనాన్ని అనుసరించాయి. అయినా.. ఆ వ్యక్తి మళ్లీ ఆ వాహనాలను ఆపే ప్రయత్నాలను చేస్తూనే ఉన్నాడు. ఈ ఘటన వీడియోలో రికార్డ్ అయింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. చాలా మంది ఆయనను ఉక్రెయిన్ ట్యాంక్ మ్యాన్(Tank Man) అంటున్నారు. రష్యా తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అలాగే, ఈ వీడియోను పెద్ద ఎత్తున షేర్ చేసుకుంటున్నారు. అయితే, ఆ వీడియో నిజంగా ఉక్రెయిన్‌లోనే చోటుచేసుకున్నదా? అవి రష్యా వాహనాలేనా? అనే అంశాలకు సంబంధించి సాధికారిక ప్రకటనలు లేవు.
చైనాలో విద్యార్థుల ఆందోళనలు ముమ్మరంగా జరిగినప్పుడు యుద్ధ ట్యాంకులకు ఎదురుగా ఓ వ్యక్తి నిర్భయంగా నిలబడి సవాల్ విసిరినట్టుగా వెళ్లాడు. ఆ యుద్ధ ట్యాంకులు కొంత సేపు నిలిచిపోవాల్సి వచ్చింది. అందుకే ఆ అనామక చైనీయుడు ట్యాంక్ మ్యాన్‌గా ప్రసిద్ధి.
