ఓ హౌజింగ్ సొసైటీలో ఫ్లాట్‌లో మహిళ డెడ్ బాడీ కనిపించింది. కుళ్లి క్రుశించిన స్థితిలో ఆ మృతదేహం ఉన్నది. ఆ మహిళ మరణించి రెండేళ్లు గడిచినా.. ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. డెడ్ బాడీ డికంపోజ్ కావడం మూలంగా పోస్టుమార్టం రిపోర్టు ఆమె మరణానికి గల కారణాలనూ తెలుసుకోలేకపోయింది. 

న్యూఢిల్లీ: ఓ హౌజింగ్ సొసైటీలో ఆ మహిళ జీవిస్తుండేది. 2019లో ఓ డాక్టర్ వద్దకు వెళ్లుతుండగా ఆ 58 ఏళ్ల మహిళ చివరిసారిగా కనిపించింది. ఆ తర్వాత ఆమె బయట ఎక్కడా కనిపించలేదు. కానీ, ఎవరికీ ఎందుకు అనే ఆలోచన రాలేదు. ఒకట్రెండు రోజులు కాదు.. ఏకంగా రెండు సంవత్సరాలుగా ఆ మహిళ ఎవరికీ కనిపించలేదు. ఇరుగు పొరుగు వారు ఆమె గురించి ఆచూకీ తీయనేలేదు. నిజానికి.. ఆమె ఎప్పుడో మరణించింది. రెండేళ్లుగా ఆమె ఫ్లాట్‌లో లివింగ్ రూమ్‌లో సోఫాపై ఆమె విగత జీవిగా మారి రెండేళ్లు గడిచింది. కానీ, ఆ హౌజింగ్ అసొసియేషన్‌ నిర్వాహకులు, ఇరుగు పొరుగు వారు ఆమె గురించి వాకబు చేయకపోవడం ఆశ్చర్యకరంగా, ఆందోళనకరంగానూ పరిణమించింది.

యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఓ హౌజింగ్ అసోసియేషన్‌లో 58 ఏళ్ల షీలా సెలియోన్ టెనెంట్‌గా ఉన్నది. ఆమె తన ఫ్లాట్‌లోని లివింగ్ రూమ్‌లో సోఫాపై విగత జీవిగా పడి ఉన్నది. ఆమె డెడ్ బాడీ మొత్తం కుళ్లిపోయింది. ఎముకలు తేలి ఉన్నది. రెండేళ్లుగా ఆ డెడ్ బాడీ అలాగే ఆ సోఫాపై పడి ఉన్నది. కానీ, ఆ ఇంటి డోర్ కొట్టినవారు లేరు. ఆమె గురించి వాకబు చేసినవారు లేరు. అంతా హౌసింగ్ అసోసియేషన్‌లో కలిసే ఉంటున్నా.. ఒక మహిళ మరణించి రెండేళ్లుగా గడిచినా బయటకు రాని ఉదంతం కలకలం రేపింది. ఫిబ్రవరిలో పెక్‌హామ్‌లోని ఫ్లాట్‌లో ఈ డెడ్ బాడీ కనిపించింది. మరణించి రెండేళ్లుగా గడిచినా గుర్తించనందుకు హౌజింగ్ సొసైటీ పీబడీ క్షమాపణలు చెప్పింది. మరో దారుణ విషయం ఏమంటే.. ఆ రెండేళ్లుగా హౌజింగ్ సొసైటీ ఆమె ఫ్లాట్‌కు రెంట్ కలెక్ట్ చేసుకుంది. చనిపోయిన మహిళకు వచ్చే సోషల్ బెనిఫిట్స్ నుంచి కలెక్ట్ చేసుకుంది.

ఆ మహిళ డెడ్ బాడీ కుళ్లి క్రుశించి పోవడంతో పోస్టు మార్టం రిపోర్టు కూడా ఆమె మరణానికి గల కారణాలను కనుగొనలేకపోయింది. ఈ కేసును లండన్‌లోని సౌత్ కరోనార్ కోర్టు విచారించింది. ఆ మహిళ బోవెల్ ఇన్‌ఫ్లేషన్ సమస్య ఎదుర్కొనేదని కోర్టుకు తెలిపారు.

‘ఎలాంటి మరణం అయినా బాధాకరమే. కానీ, రెండేళ్లుగా ఆమె మరణాన్ని కూడా గుర్తించకపోవడమే ఆలోచనలకు కూడా అందని దారుణం.. అదీ 2022లో ఇలా జరగడం’ అని అధికారి జూలియన్ మోరిస్ తెలిపారు.

ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిగింది. హౌజింగ్ సొసైటీపై ఆ దర్యాప్తు అధికారులు తీవ్రంగా మండిపడ్డారు. ఆ మహిళ మరణాన్ని ఆ హౌజింగ్ సొసైటీ గుర్తించలేకపోయారని ఆగ్రహించింది. షీలా సెలియోన్ రెంట్ కట్టకపోవడంతో ఆమె సోషల్ బెనిఫిట్స్ నుంచి రెంట్ కలెక్ట్ చేసుకోవడానికి హౌజింగ్ సొసైటీ అప్లికేషన్ పెట్టుకుంది. ఓ తనిఖీ సందర్భంలో ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమె గ్యాస్ సప్లై కూడా కట్ చేశారు.