ఇప్పటికే కరోనా వైరస్‌తో ఏం చేయాలో, ఎలా చేయాలో అర్ధంకాక తలపట్టుకుంటున్న బ్రిటన్‌కు.. కొత్త స్ట్రెయిన్ లేనిపోని తలనొప్పులు తీసుకువస్తోంది. ఈ మహమ్మారి కారణంగా యూకే మూడోసారి లాక్‌డౌన్‌లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది.

వైరస్ వ్యాప్తికి అడ్డకట్ట వేసి, లాక్‌డౌన్‌ను ఎత్తివేసేందుకు తాము వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. మరోవైపు, యూకే నిర్వహించిన మాస్‌ టెస్టింగ్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

దీని ప్రకారం ఇంగ్లాండ్‌లో ప్రతి 50 మందిలో ఒకరు, లండన్‌లో ప్రతి 30 మందిలో ఒకరు కొవిడ్ బారినపడ్డారట. కరోనా బారిన పడినప్పటికీ, లక్షణాలు కనిపించనివారిని గుర్తించేందుకు ప్రభుత్వం జరిపిన నిర్ధారణ పరీక్షల్లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

ఈ నేపథ్యంలో దేశంలో జరుగుతున్న కరోనా టీకా కార్యక్రమం గురించి ప్రధాని ప్రజలకు తెలిపారు. 80 ఏళ్లకు పై బడిన 23 శాతం మందికి ఇప్పటికే మొదటి డోసు టీకాలు అందాయని బోరిస్ జాన్సన్ వెల్లడించారు.

దీని వల్ల ప్రమాదం పొంచి ఉన్న వర్గానికి వైరస్ నుంచి రక్షణ ప్రారంభమైందన్నారు. ఫిబ్రవరి మధ్యనాటికి ముప్పు ఎక్కువగా వున్న 14 మిలియన్ల మందికి టీకాలు అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.

ఇప్పటికే బ్రిటన్‌లో 1.3 మిలియన్ల మంది కోవిడ్ మొదటి డోసును వేయించుకున్నారని ఆయన తెలిపారు . అయితే కరోనా తీవ్రత దృష్ట్యా ఫిబ్రవరిలో లాక్‌డౌన్ ఎత్తేస్తారా లేదా అన్న అంశంపైనా జాన్సన్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోయారు.

మూడోసారి లాక్‌డౌన్ విధింపు నిర్ణయాన్ని ప్రధాని జాన్సన్ సమర్థించుకున్నారు. గతేడాది ఏప్రిల్‌లో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా వున్నప్పటి కంటే.. ఇప్పుడు 40 శాతం ఎక్కువ మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ప్రధాని చిట్టా విప్పారు. కాగా, యూకేలో ఇప్పటి వరకు 27 లక్షల మందికి పైగా వైరస్ బారిన పడగా..76 వేల మంది కన్నుమూశారు.