Asianet News TeluguAsianet News Telugu

చైనాకు థాంక్స్ చెప్పిన యూకే గూఢచారి.. జేమ్స్ బాండ్ స్పూఫ్ వీడియోపై కామెంట్

యూకే గూఢచారి రిచర్డ్ మూర్ తొలిసారి చైనాకు థాంక్స్ చెప్పారు. అయితే.. అది కూడా కామెడీగా తెలిపారు. యూకే, యూఎస్ గూఢచారులపై స్పూఫ్‌గా తీసిన వీడియోను చైనా అధికారిక మీడియా సంస్థ జిన్హువా ట్విట్టర్‌లో పోస్టు చేసింది. దీనిపై రిచర్డ్ మూర్ రియాక్ట్ అయ్యారు. తన ప్రసంగాన్ని ఆ వీడియో కింద పోస్టు చేసి.. తనకు ఫ్రీ పబ్లిసిటీ కల్పించినందుకు థాంక్స్ అని ట్వీట్ చేశారు.
 

UK spy says thanks to china media on james bond spoof video
Author
New Delhi, First Published Jan 6, 2022, 5:35 PM IST

న్యూఢిల్లీ: పాశ్చాత్య దేశాలకు, చైనా(China)కు ఏ విషయంలోనూ అభిప్రాయాలు పొసగవు. వాణిజ్య, ఆర్థిక, రాజకీయ, ఇతర అనే విషయాలపై ఘర్షణలు చోటుచేసుకుంటాయి. బయటకు కనపడే ఘర్షణలు కొన్ని అయితే.. రహస్యంగా ఇరు పక్షాల మధ్య ఎన్ని ఎత్తులు, పై ఎత్తులు ఉంటాయనేది ఊహకు అందవు. కానీ, బహుశా తొలిసారిగా యునైటెడ్ కింగ్‌డమ్ గూఢచారి(UK Spy).. చైనాకు థాంక్స్(Thanks) చెప్పారు. అదీ సోషల్ మీడియాలో ధన్యవాదాలు తెలిపారు. తన లింక్‌కు ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నందుకూ థాంక్స్ అని పేర్కొన్నారు. చైనాలో వీగర్ కమ్యూనిటీపై అరాచకాలు, బ్రిటీష్ గత కాలనీ హాంగ్‌కాంగ్‌పై నియంతృత్వ చట్టాలు అమలు చేయడంపై యూకే పలుమార్లు విమర్శిస్తూనే ఉన్నది.

జేమ్స్ బాండ్‌ను హేళన చేస్తూ రూపొందించిన ఓ స్పూఫ్ వీడియోను చైనా అధికారిక మీడియా సంస్థ జిన్హువా ట్విట్టర్‌లో పోస్టు చేసింది. పాశ్చాత్య దేశాలు చైనాపై చేస్తున్న ఆరోపణలు.. అన్ని దేశాలపై నిఘా వేస్తుందని, అప్పు ఉచ్చులో దింపి ఆర్థికంగా తన పని సులువు చేసుకుంటుందని పాశ్చాత్య దేశాలు ఆరోపణలు చేస్తున్నారు. తమ నిఘా ఎక్కువగా చైనాపై ఉండాలని.. ప్రాధాన్యాల్లోనూ చైనాకు టాప్ ప్రయారిటీ ఇవ్వాలని యూకే గూఢచార సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే వారి ఆరోపణలు డొల్లవని, ఎంత అవాస్తవంగా ఉన్నాయో వెల్లడిస్తూ రూపొందించిన ఓ స్పూఫ్ వీడియోను చైనా అధికారిక మీడియా ట్వీట్ చేసింది. దీనిపై యూకే ఎంఐ6 హెడ్ రిచర్డ్ మూర్ స్పందించారు. ఫ్రీ పబ్లిసిటీ కోసం ధన్యవాదాలు అని చెబుతూ తన ప్రసంగ లింక్‌ను యాడ్ చేశారు.

గతంలో రిచర్డ్ మూర్ చైనాపై కటువుగా మాట్లాడారు. సింగిల్ గ్రేటెస్ట్ ప్రయారిటీ చైనానే అని పేర్కొన్నారు. చైనా ఇతర దేశాలకు అప్పుల వల వేస్తున్నదని ఆరోపించారు. ఆ అప్పు ఉచ్చులో పడ్డాక ఆ దేశాల పోర్టులు, ఇతర మౌలిక సదుపాయాలను చౌకగా వినియోగించుకుంటున్నదని పేర్కొన్నారు. ఇతర దేశాలపైనా నిఘా వేస్తున్నదని ఆరోపణలు చేశారు.

జిన్హువా ట్వీట్ చేసిన వీడియో టైటిల్ ‘నో టైమ్ టు డై లాఫింగ్’ అని పెట్టారు. నాలుగున్నర నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియో మొత్తం హాస్యంతో నిండి ఉన్నది. అందులో బ్రిటన్, అమెరికా దేశాల గూఢచారులు ఒక చోట రహస్యంగా కలుస్తారు. జేమ్స్ పాండ్, బ్లాక్ విండో‌లు వారి పేర్లు. ఇద్దరూ ఓ క్యాజిల్‌లో చేరిన తర్వాత ఆమె కొన్ని దస్త్రాలను చదువుతుంది. నిఘా వేయడానికి చైనా అనుసరించే విధానాలు అంటూ చదవడం మొదలు పెట్టి.. చివరకు అవి అమెరికాకు సంబంధించిన వివరాలు అని రియలైజ్ అవుతారు. అంతేకాదు.. ఆ యూకే గూఢచారి మొబైల్ ఫోన్‌ను అమెరికా ట్యాప్ చేసినట్టు జేమ్స్ పాండ్‌కు తెలుస్తుంది. ఒక డివైజ్ నుంచి వినిపించే ఆ వాయిస్‌ను దాని గురించి ప్రశ్నించగా.. అది ట్యాపింగ్ కాదని, మిత్ర దేశాల మధ్య రహస్యాలేమీ లేవని పేర్కొంటుంది. చివరకు రెండు వేర్వేరు ఫోన్‌లు వారికి అందించి అవి సీఐఏ సర్టిఫై చేసినవని చెబుతుంది. అది కాకుండా చైనాకు చెందిన హువావే ఫోన్లు వాడవద్దని సూచిస్తుంది. చివరకు ఆయన అమెరికా మనిషి కాదని, అమెరికాపై నిఘా వేసిన బ్రిటన్ అని తెలుస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios