అమెరికా చేసిన విజ్ఞప్తిని యూకే అంగీకరిస్తూ వికిలీక్స్ ఫౌండర్ జూలియన్ అసాంజేను ఆ దేశానికి తరలించడానికి సిద్ధం అయింది. అందుకు సంబంధించిన దస్త్రాలపై ఇంటీరియర్ మినిస్టర్ ప్రీతి పటేల్ సైన్ చేశారు. మిలిటరీకి చెందిన సీక్రెట్ ఫైల్స్‌ను అసాంజే పబ్లిష్ చేశాడని, ఆయనను విచారించాలని అమెరికా, యూకేను కోరింది. 

న్యూఢిల్లీ: వికిలీక్స్ ఫౌండర్ జూలియన్ అసాంజేను తమకు అప్పగించాలన్న అమెరికా విజ్ఞప్తికి ఇంగ్లాండ్ అంగీకరించింది. జూలియన్ అసాంజేను అమెరికాకు తరలించడానికి యూకే ఇంటీరియర్ మినిస్టర్ ప్రీతి పటేల్ ఆమోదం తెలిపారు. మిలిటరీకి చెందిన రహస్య దస్త్రాలను ప్రచురించిన ఆరోపణలపై జూలియన్ అసాంజేను విచారించాల్సి ఉన్నదని, అందుకోసమే ఆయనను తమకు అప్పగించాలని అమెరికా రిక్వెస్ట్ చేసింది. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా యుద్ధం, అమెరికా పాల్పడ్డ యుద్ధ నేరాల గురించి జూలియన్ అసాంజే అనేక రహస్య ఫైల్స్‌ను బహిర్గతం చేశాడు.

జిల్లా మెజిస్ట్రేట్, హైకోర్టులు జూలియన్ అసాంజేను అమెరికాకు అప్పగించాలనే ఆదేశాలు ఇచ్చాయని ఇంటీరియర్ మినిస్ట్రీ సెక్రెటరీ వెల్లడించారు. ఇలా ఆదేశాలు వెలువడగానే అందుకు అభ్యంతరం చెప్పడానికి అర్హమైన కారణాలు ఉంటే ఆదేశాలను తిరస్కరించవచ్చని చెప్పారు. కానీ, జూలియన్ అసాంజేను అమెరికాకు అప్పగించకుండా అడ్డుకోవడానికి తగిన కారణాలు లేవని, అందుకే ఆ ఆదేశాలకు ఆమోదం తెలిపినట్టు పేర్కొన్నారు. అయితే, ఈ ఆదేశాలను కూడా సవాలు చేయడానికి జూలియన్ అసాంజేకు 14 రోజుల గడువు ఉన్నదని తెలిపారు.

కాగా, ప్రీతి పటేల్ నిర్ణయం తీసుకోవడంపై జూలియన్ అసాంజే మద్దతుదారులు మండిపడుతున్నారు. ఇది పాత్రికేయ స్వేచ్ఛకు, యూకే ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని అంటున్నారు. అంతేకాదు, ఈ ఆదేశాలను హైకోర్టులో అప్పీల్ చేస్తామని ప్రతిన బూనారు.

జూలియన్ అసాంజే ఏ తప్పూ చేయలేదని వికిలీక్స్ సంస్థ వాదించింది. ఆయన ఏ నేరమూ చేయలేదని, ఆయన నేరస్తుడు అసలే కాదని పేర్కొంది. ఆయన ఒక పాత్రికేయుడని, ఒక ప్రచురణకర్త అని వివరించంది. ఆయన కేవలం ఆయన వృత్తి నిర్వర్తించాడని తెలిపింది. అమెరికా యుద్ధ నేరాలకు పాల్పడిందని నిరూపించే ఎవిడెన్స్‌ను జూలియన్ అసాంజే ప్రచురించాడని, అందుకే ఆయనపై దాఖలైన కేసు ఒక రాజకీయ కేసు అని పేర్కొంది.

అమెరికాకు తరలించడమంటే.. ఆయనను కనిపించకుండా చేయడమేనని తెలిపింది. ఆయన తన జీవితమంతా ఊచల వెనుక చీకటిలో గడిపే కుట్రేనని ఆరోపించింది. అంతేకాదు, ఇతరులెవరూ మరోసారి ప్రభుత్వాన్ని జవాబుదారీగా బోనులో నిలబెట్టే పని చేయకుండా అడ్డుకునే ఒక హెచ్చరిక అని తెలిపింది.

ఈ నిర్ణయంపై ఆమ్నెస్టీ ఇంటర్నేషన్‌ కూడా ఆవేదన వ్యక్తం చేసింది. జూలియన్ అసాంజేను అమెరికాకు తరలిస్తే.. ఆయన తన జీవితకాలం అంతా ఒంటరిగా నిర్బంధంలో గడపాల్సిన ముప్పు ఉన్నదని తెలిపింది. అదే నిజమైతే.. అనేక విషయాలను ఉల్లంఘించినట్టే అవుతుందని వివరించింది. 

అసాంజేను ఒంటరిగా నిర్బంధించబోమని అమెరికా దౌత్య మార్గంలో చెబుతున్న మాటలను నమ్మలేం అని, అది దాని చరిత్ర చూసి నిర్ధారించుకోవచ్చని ఆమ్నెస్టీ తెలిపింది.