Asianet News TeluguAsianet News Telugu

పెన్షన్ కోసం పోస్టాఫీసుకు డెడ్‌బాడీని నడిపించుకుంటూ తీసుకెళ్లారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఇద్దరు దుండగులు ఓ డెడ్ బాడీని పోస్టాఫీసుకు వెంట తెచ్చి ఆయన పెన్షన్ ఇవ్వాల్సిందిగా కోరారు. కొత్త టీషర్ట్ వేసి తలపై టోపీ పెట్టి ఆయనను ఇద్దరు చెరోవైపు సపోర్ట్ ఇస్తూ నడుచుకుంటూ వచ్చినట్టే తీసుకువచ్చారు. స్టాఫ్‌కు వారిద్దరి వాలకం అనుమానాస్పదంగా కనిపించింది. పెన్షనర్‌కు ఏమైందని అడగ్గా.. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని సర్ది చెప్పబోయారు. ఆ తర్వాత వారు నేలపై పడుకోబెట్టి హార్ట్ ఎటాక్ వచ్చిందని చెప్పారు. దీంతో అక్కడి వారు అంబులెన్స్‌ను పిలిపించడంతో వారి కథ కంచికి చేరింది.

two people drag deadbody postoffica to claim pension
Author
New Delhi, First Published Jan 23, 2022, 3:13 PM IST

న్యూఢిల్లీ: సినిమాను తలపించేలా.. ఇద్దరు దుండగులు మరణించిన మనిషిని పోస్టాఫీసు(Post Office)కు తీసుకెళ్లారు. ఆ వ్యక్తి పెన్షన్(Pension) తీసుకోవడానికి ఇద్దరు చెరోవైపు నిలబడి లాక్కెళ్లారు. ఎవరికీ డౌట్ రాకుండా ఆ డెడ్‌బాడీకి కొత్త టీషర్ట్ వేశారు. తలపై హ్యాట్ పెట్టారు. ఇద్దరు ఆ డెడ్‌బాడీ(Dead Body)ని పక్కన నిలబెట్టుకుని మోస్తూనే నడిచారు. వారితోపాటు నడుచుకుంటూ వస్తున్నట్టు ఇతరులను నమ్మించే ప్రయత్నం చేశారు. ఏకంగా పోస్టాఫీసు దాకా తీసుకెళ్లారు. ఆ తర్వాత వారి ప్లాన్ బెడిసికొట్టింది. ఈ ఘటన ఐర్లాండ్‌లో చోటుచేసుకుంది.

కార్లో కౌంటీకి చెందిన పీడర్ డోయల్ చనిపోయాడు. ఆయన వయసు 60 ఏళ్లు దాటి ఉంటుంది. ఆయనకు పోస్టాఫీసులో పెన్షన్ వస్తుంది. ఈ విషయం తెలిసిన ఇద్దరు దుండగులు పక్కా ప్లాన్ వేసుకున్నారు. ఆ డెడ్ బాడీతో ఆయన పెన్షన్ పొందాలని విఫల ప్రయత్నం చేశారు. తొలుత శుక్రవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఆ ఇద్దరు పోస్టాఫీసుకు వెళ్లారు. మరణించిన వ్యక్తి వివరాలు చెప్పి పెన్షన్ అడిగారు. కానీ, పోస్టాఫీసు సిబ్బంది అందుకు నిరాకరించారు. పెన్షనర్ స్వయంగా ఇక్కడకు రావాలని, లేదా ఆయన కుటుంబీకులు వచ్చినా ఇస్తామని వివరించారు. దీంతో వారికి ఎదరుదెబ్బ తగిలింది.

ఇక లాభం లేదని, ఏకంగా డెడ్ బాడీని పోస్టాఫీసుకు తీసుకు రావాలని అనుకున్నారు. పోస్టాఫీసుకు ఆ డెడ్ బాడీని తేవడానికి ఏ వాహనాన్ని ఉపయోగించకపోవడం గమనార్హం. ఫుట్‌పాత్ వెంటే ఇద్దరు చెరోవైపు ఉండి డెడ్ బాడీని వెంటపెట్టుకుని పోస్టాఫీసు చేరారు. ఇరుగుపొరుగు వారు కాస్త అనుమానంగా చూశారు. ఆ డెడ్ బాడీని పోస్టాఫీసులోకి తీసుకువెళ్లారు. కానీ, అక్కడ క్యూ లైన్ పెద్దగా ఉన్నది. దీంతో ఆ డెడ్ బాడీని పట్టుకునే అక్కడ కాసేపు వెయిట్ చేశారు. వారి వాలకం చూసి అక్కడి సిబ్బందికి అనుమానం వచ్చింది.

ఆ మనిషి ఎందుకు అలా ఉన్నాడని అడిగారు. ఆయన ఆరోగ్యం బాగాలేదని ఆ ఇద్దరు దుండగులు చెప్పారు. ఆ తర్వాత ఆ మనిషిని నేలపై పడుకోబెట్టారు. మరోసారి ప్రశ్నించగా.. ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చిందని వివరించారు. దీంతో సిబ్బంది అప్రమత్తమైంది. వెంటనే అంబులెన్స్‌ను పిలిచారు. దీంతో వారి ప్లాన్ బెడిసి కొట్టింది. అయినప్పటికీ వారు అక్కడి నుంచి కదలలేదు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనను వారు ఎందుకు తెచ్చారని, ఆయన ఎప్పుడు మరణించారనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

పోస్టాఫీసుకు తీసుకుని వచ్చేటప్పుడు ఆయన బతికే ఉన్నాడని వారిద్దరు పోలీసులకు తెలిపారు. దీంతో ఆ మనిషి నిజంగానే అప్పుడు బతికే ఉండేనా? ఆయన నివాసం పరిసరాల్లో సహజంగానే మరణించాడా? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, ఓ వృద్ధురాలు.. ఆన్‌లైన్‌(Online)లో పిజ్జా ఆర్డర్(Pizza Order) చేసింది. ఓ సారి డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ చేసుకుంది. ఈ రెండు సార్లు ఆమె రూ. 11 వేలకు పైగా పోగొట్టుకున్నది. ఆ డబ్బును తిరిగి పొందాలని శతవిధాల ప్రయత్నించింది. ఆన్‌లైన్‌లో పోయిన డబ్బు రికవరీ చేసుకోవడానికి గూగుల్‌లోనూ వెతికింది. అందులో ఓ కాంటాక్టు నెంబర్ కనిపించింది. ఆ నంబర్‌కు కాల్ చేసి.. ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడుతూ పోగొట్టుకున్న డబ్బుల రికవరీ గురించి అడిగింది. ఈ క్రమంలోనే ఫోన్‌ కాల్‌లో ఎదుటి వ్యక్తి(Cyber Fraudster) చెప్పినట్టుగా చేసి చివరకు రూ. 11 లక్షల సొమ్మును పోగొట్టుకుంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ సైబర్ పోలీసు స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని ఆంధేరి సబర్బన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios