ఇద్దరు పాకిస్తాన్ గూఢచారులు అమెరికా అధ్యక్షుడు టార్గెట్‌గా అమెరికాలో కార్యకలాపాలు మొదలు పెట్టినట్టు తెలిసింది. అమెరికా సీక్రెట్ సర్వీసు అధికారులను లోబరుచుకుంటూ అమెరికా అధ్యక్షుడి వరకు వెళ్లాలని ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. ఇందులో భాగంగా వారు యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ బైడెన్ సెక్యూరిటీ అధికారుల వరకూ వెళ్లినట్టు తెలిసింది. ఈ ఇద్దరినీ ఎఫ్‌బీఐ అధికారులు అరెస్టు చేశారు.

న్యూఢిల్లీ: అమెరికా, పాకిస్తాన్ మధ్య సంబంధాలు కొంత కాలంగా చాలా దిగజారిపోయాయి. ఇప్పుడు ఇది బహిరంగంగానే కనిపిస్తున్నది. ముఖ్యంగా ఉక్రెయిన్‌లో రష్యా దాడి తర్వాత పాకిస్తాన్ దేశం అమెరికాను తృణీకరించింది. పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్ కూడా పలుమార్లు అమెరికాపై బహిరంగంగానే ఇండైరెక్ట్‌లో కామెంట్ చేశారు. ఇది రాజకీయంగా బయటకు కనిపించే వ్యవహారం. కానీ, ఇటీవలే ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ గురించి రహస్య వివరాల సేకరణ లక్ష్యంగా ఇద్దరు పాకిస్తాన్‌కు చెందిన గూఢచారులు అమెరికాలో ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆ ఇద్దరినీ పట్టుకుంది.

వాషింగ్టన్ డీసీలో పాకిస్తాన్ నిఘా విభాగం ఐఎస్ఐతో సంబంధాలున్నాయని భావిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఫెడరల్ ఏజెంట్లుగా చిత్రీకరించుకున్నారు. అమెరికా ప్రభుత్వ అధికారులను ప్రలోభపెట్టి ఆ దేశ రక్షణ వ్యవస్థ, సీక్రెట్ సర్వీసులతో తమకు సంబంధాలు ఉన్నట్టుగా చిత్రీకరించుకున్నారు. ఇలా ఒకరి తర్వాత ఒకరిని ప్రలోభ పెట్టుకుంటూ అమెరికా తొలి మహిళా పౌరురాలు, అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ బైడెన్ సెక్యూరిటీ కవర్ వరకు వారు వెళ్లగలిగారు. అరియన్ తహెర్జదేహ్ (40), హైదర్ అలీ (35)లను ఎఫ్‌బీఐ వాషింగ్టన్‌లో అరెస్టు చేసింది. ఈ ఇద్దరితో కొన్ని అక్రమ వ్యవహారాలు నడిపినట్టుగా భావిస్తున్న నలుగురు అమెరికా సీక్రెట్ సర్వీస్ సభ్యులనూ లీవుపై పంపింది. ఈ కేసును ప్రస్తుతం కోర్టు విచారిస్తున్నది.

అమెరికా హోమ్‌లాండ్ సెక్యూరిటీ శాఖ పరిధిలోనే తాము బాధ్యతలు నిర్వర్తిస్తున్నామని వారు తప్పుడు గుర్తింపులు చెప్పుకున్నారు. వాటి ద్వారా ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్, డిఫెన్స్ కమ్యూనిటీ సభ్యులకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా వారు అమెరికా ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ సెక్యూరిటీ వివరాలకు సంబంధించిన విధులు నిర్వహించే ఓ యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ అధికారికీ ఫ్రీ అపార్ట్‌మెంట్, ఇతర బహుమతులు అందించారని సమాచారం.

ముఖ్యంగా తహెర్జదేహ్ అమెరికాకు చెందిన సీక్రెట్ సర్వీస్, డీహెచ్ఎస్ ఉద్యోగులకు విలవైన వస్తువులు, అద్దె లేని అపార్ట్‌మెంట్‌లను అందించి లోబరుచుకునే ప్రయత్నాలు చేశారు. ఐఫఓన్లు, సర్వెలెన్స్ సిస్టమ్స్, డ్రోన్‌లు, ఫ్లాట్ స్క్రీన్ టీవీ, అజాల్ట్ రైఫిల్ దాచుకునే సూట్, జెనరేటర్‌ల వంటివి ఇచ్చారు. అమెరికా అధికారులు ఎక్కువగా ఉంటున్న అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌ల సీసీటీవీ ఫుటేజీలను, ఇతర సర్వెలెన్స్ డివైజ్‌లో వారి వ్యక్తిగత వివరాలను తెలుసుకునే యాక్సెస్‌ను ఈ ఇద్దరు పాకిస్తానీలు సంపాదించుకున్నట్టు తెలిసింది. హైదర్ అలీ కొందరితో తమకు పాకిస్తాన్ ఏజెన్సీ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని సాక్షులకు చెప్పినట్టు అసిస్టెంట్ యూఎస్ అటార్నీ జోషువా రోత్‌స్టెయిన్ కొలంబియా జిల్లా కోర్టు మెజిస్ట్రేట్ జడ్జీ జీ మైఖేల్ హార్వీకి తెలియజేశారు.

హైదర్ అలీకి పాకిస్తాన్, ఇరాన్‌కు చెందిన చాలా వీసాలు ఉన్నాయని వివరించారు. పశ్చిమ ఆసియా, ఇస్తాంబుల్, టర్కీ, ఖతర్‌లోని దోహా సహా పలు ప్రాంతాలకు అలీ ప్రయాణించారు. యూఎస్ పోస్టల్ సర్వీస్ లెటర్ క్యారియర్ ఫిర్యాదుతో వీరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. యూఎస్ స్పెషల్ పోలీసు ఇన్వెస్టిగేషన్ యూనిట్‌ ఉద్యోగులుగా ఆ ఇద్దరు తమను తాము చెప్పుకున్నారు. వారు అడర్ కవర్ గ్యాంగ్ సంబంధ దర్యాప్తులు చేస్తామని, 2021 క్యాపిటల్ హిల్ అల్లర్లపైనా దర్యాప్తులు జరుపుతున్నట్టు వివరించారు.