డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని నార్త్ కివు ప్రావిన్స్‌లోని ఐక్యరాజ్యసమితిస్టెబిలైజేషన్ మిషన్ స్థావరంపై మంగళవారం జరిగిన దాడిలో ఇద్దరు భారతీయులతో సహా ఐకరాజ్య సమితికి చెందిన ముగ్గురు శాంతిపరిరక్షకులు మరణించారు.
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని నార్త్ కివు ప్రావిన్స్‌లోని ఐక్యరాజ్యసమితిస్టెబిలైజేషన్ మిషన్ స్థావరంపై మంగళవారం జరిగిన దాడిలో ఇద్దరు భారతీయులతో సహా ఐకరాజ్య సమితికి చెందిన ముగ్గురు శాంతిపరిరక్షకులు మరణించారు. అక్కడ రెండు రోజులుగా ఐకరాజ్య సమితికి వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు జరుగుతున్నాయి. ఈ హింసలో ఏడుగురు నిరసనకారులు కూడా మరణించారని బుటెంబో పోలీసు చీఫ్ పాల్ న్గోమా తెలిపారు. ఇక, మోనుస్కో (ఐకరాజ్య సమితి శాంతి పరిరక్షక దళం) సాయుధ సమూహాలకు వ్యతిరేకంగా చర్య తీసుకోవడంలో విఫలమవుతోందనే ఆరోపణలతో సోమవారం సమస్యాత్మక ప్రాంతంలో ప్రదర్శనలు చెలరేగాయి.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మోనుస్కోకు నియమించబడిన ఇద్దరు శాంతి పరిరక్షకులు ప్రాణాలు కోల్పోయారని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆ వీరుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నట్టుగా చెప్పారు. ‘‘ఈ దారుణమైన దాడులకు పాల్పడినవారిని జవాబుదారీగా ఉంచాలి. చట్టం ముందు నిలబెట్టాలి’’ అని జై శంకర్ ట్వీట్ చేశారు.
దేశంలో ఐక్యరాజ్యసమితి మిషన్‌కు వ్యతిరేకంగా కాంగోలోని తూర్పు నగరమైన గోమాలో నిరసన ప్రదర్శనలు రెండో రోజుకు చేరాయని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. కాంగో యొక్క తూర్పు ప్రాంతంలో హింస పెరుగుతున్నప్పటికీ.. శాంతి పరిరక్షక దళాలు పౌరులను రక్షించడంలో విఫలమయ్యాయని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం నిరసనకారులు గోమాలోని ఐకరాజ్య సమితి మిషన్ కార్యాలయాల్లోకి నిప్పుపెట్టి బలవంతంగా ప్రవేశించారు. కొన్నేళ్లుగా కాంగోలో ఉన్న ఐకరాజ్య సమితి దళాలను విడిచిపెట్టాలని వారు పిలుపునిచ్చారు.
ఇక, ప్రస్తుత ఐకరాజ్య సమితి మిషన్ MONUSCO.. మునుపటి మిషన్ నుండి 2010లో బాధ్యతలు స్వీకరించింది. ఇది ప్రస్తుతం 17,000 మంది సిబ్బందిని కలిగి ఉంది. ఇందులో 2000 మంది సిబ్బందితో భారతదేశం రెండవ అతిపెద్ద ట్రూప్ కంట్రిబ్యూటర్‌గా ఉంది. భారత సైనికులు 1960 నుంచి ఐకరాజ్య సమితి శాంతి పరిరక్షకులుగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మోహరించారు. తాజా మరణాలతో.. కాంగోలో భారతదేశం 53 మంది సైనికులను కోల్పోయినట్టుగా నివేదికలు సూచిస్తున్నాయి.
