Asianet News TeluguAsianet News Telugu

స్మగ్లర్ల ఘాతుకం.. 14 అడుగుల గోడమీది నుంచి చిన్నారులను ఎడారిలోకి విసిరేసి... !

మంగళవారం సాయంత్రం శాంతా థెరిసా ఏజెంట్ సరిహద్దు గోడను పర్యవేక్షిస్తున్న కెమెరాలు పరిశీలిస్తుండగా ఈ ఘటన కంట పడింది. ఓ స్మగ్లర్ 14 అడుగుల ఎత్తైన గోడ మీదినుంచి ఇద్దరు చిన్న పిల్లలను విసిరేయడం గమనించాడు.. అని  సిబిపి ఒక ప్రకటనలో తెలిపింది.

Two Girls, 3 And 5, Dropped Over 14-Foot Wall At US-Mexico Border - bsb
Author
Hyderabad, First Published Apr 1, 2021, 11:18 AM IST

యుఎస్-మెక్సికన్ సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా యుఎస్-మెక్సికన్ సరిహద్దుల్లోని 14 అడుగుల గోడ మీదినుంచి ఇద్దరు ఈక్వడోరన్  చిన్నారులను యుఎస్ సరిహద్దుల్లోకి దింపారు. మంగళవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో మూడేళ్లు, ఐదేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులను యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సిబిపి) అధికారులు పట్టుకున్నారు.  ఈ మేరకు ఏజెన్సీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. 

మంగళవారం సాయంత్రం శాంతా థెరిసా ఏజెంట్ సరిహద్దు గోడను పర్యవేక్షిస్తున్న కెమెరాలు పరిశీలిస్తుండగా ఈ ఘటన కంట పడింది. ఓ స్మగ్లర్ 14 అడుగుల ఎత్తైన గోడ మీదినుంచి ఇద్దరు చిన్న పిల్లలను విసిరేయడం గమనించాడు.. అని  సిబిపి ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ఇద్దరు చిన్నారులను న్యూ మెక్సికోలోని శాంటా తెరెసా సిబిపి స్టేషన్‌కు తరలించారు. అక్కడి వైద్య సిబ్బంది వీరిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు చిన్నారులు ఏజెన్సీ అదుపులో ఉన్నారని సిబిపి తెలిపింది.

‘నిన్న రాత్రి 14 అడుగుల ఎత్తైన గోడ మీదినుంచి దుర్మార్గులు చిన్నారులను విసిరేయడం చూసి భయపడ్డాను’  అని చీఫ్ పెట్రోలింగ్ ఏజెంట్ గ్లోరియా చావెజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దారుణానికి కారణమైన వారిని గుర్తించేందుకు యుఎస్ ఏజెంట్లు మెక్సికన్ అధికారులతో కలిసి పనిచేస్తున్నారని చావెజ్ తెలిపారు.

మా సిబ్బంది మొబైల్ టెక్నాలజీని ఉపయోగించకపోయి ఉంటే.. వీరిని కనిపెట్టలేకపోయేవారు. దీంతో ఈ చిన్నారులు ఎడారి వేడిలో, ఉక్కలో గంటల తరబడి ఇబ్బందులు పడేవారు అని చావెజ్ చెప్పారు.

దక్షిణ సరిహద్దునుంచి యునైటెడ్ స్టేట్స్ లోకి వస్తున్న వలసదారులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ముఖ్యంగా ఎక్కువగా సెంట్రల్ అమెరికన్లు తమ దేశంలోని పేదరికం, హింస నుండి పారిపోతున్నారని అంటున్నారు.

ఇటీవల, ప్రతిరోజూ సగటున 500 మంది పిల్లలు ఒంటరిగా సరిహద్దులు దాటి వస్తున్నారు. దీంతో అధ్యక్షుడు జో బిడెన్ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుంటోంది. ఇలా రోజుకు ఇంతమంది మైనర్లు వస్తుంటే వారి బాగోగులు ఎలా అనే దానిమీద చాలా విమర్శలు ఉన్నాయి.

అధికారిక గణాంకాల ప్రకారం, హెల్త్ అండ్ హ్యుమన్ సర్వీసెస్ డిపార్ట్ మెంట్ వద్ద మంగళవారం నాటికి 12,918 మంది ఇలా వలస వచ్చిన పిల్లలు ఉన్నారు. మరో 5,285 మంది సంరక్షణకు సిబిపి బాధ్యత వహిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios