ఆస్ట్రేలియాలో కాల్పుల బీభత్సం.. ఇద్దరు పోలీసులు సహా ఆరుగురు దుర్మరణం
ఆస్ట్రేలియాలో కొందరు సాయుధులు తుపాకులతో బీభత్సం సృష్టించారు. పోలీసులపై కాల్పులతో తెగబడి ఇద్దరు అధికారుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. కొన్ని గంటలపాటు సాగిన ఈ కాల్పుల్లో మొత్తం ఆరుగురు మరణించారు.

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో కొందరు సాయుధులు కాల్పులతో బీభత్సం సృష్టించారు. మిస్సింగ్ పర్సన్‌ను వెతకడానికి వెళ్లిన పోలీసులపై మూకుమ్మడిగా తుపాకులతో కాల్పులు జరిపారు. ప్రాణాలు కాపాడుకునే వీలే చిక్కని పోలీసులు తూటాలకు బలయ్యారు. ఇద్దరు పోలీసులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో పోలీసుకు బుల్లెట్ గాయాలు అయ్యాయి. నాలుగో పోలీసు అధికారి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.
కాల్పుల ఘటన తెలియగానే స్పెషలిస్టు పోలీసులు అక్కడికి వచ్చారు. కానీ, అంతలోపే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కొన్ని గంటలపాటు జరిగిన ఈ కాల్పుల ఘటనలో సాయుధులుగా భావిస్తున్న ఇద్దరు పురుషులు, మరో మహిళ మరణించింది. కాగా, కాల్పుల్లో పొరుగునే ఉన్న ఓ వ్యక్తి కూడా మరణించినట్టు పోలీసు అధికారులు వివరించారు. మరణించిన పోలీసు కానిస్టేబుళ్లను 26 ఏళ్ల మాథ్యూ ఆర్నల్డ్, 29 ఏళ్ల రాచెల్ మెక్ క్రోగా గుర్తించారు. వీరిద్దరూ ఇటీవలే పోలీసు వృత్తిలోకి వచ్చారు.
క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలో పశ్చిమ బ్రిస్బేన్ నుంచి 270 కిలోమీటర్ల దూరంలోని వియంబిల్లాలో సోమవారం ఈ ఘటన జరిగింది. పోలీసులపై కాల్పులు జరపడానికి గల కారణాలు మాత్రం ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి. ఇది ఆస్ట్రేలియాకు హార్ట్ బ్రేకింగ్ డే అని ప్రధానమంత్రి ఆంథోనీ ఆల్బనీస్ పేర్కొన్నారు.
Also Read: Mexico Shootout : మెక్సికోలో కాల్పుల బీభత్సం.. 19 మందిని హతమర్చిన దుండగులు..
వియంబిల్లాలో భయానక దృశ్యాలు కనిపించాయని, విధులు నిర్వర్తిస్తూ మరణించిన క్వీన్స్‌లాండ్ పోలీసు అధికారుల కుటుంబాలు, మిత్రులకు ఇది హార్ట్ బ్రేకింగ్ డే అని ట్వీట్ చేశారు. వారందరికీ తన సానుభూతి అని తెలిపారు. ఈ రోజు రాత్రి ఆస్ట్రేలియా కూడా మీతోపాటు బాధతోనే ఉన్నదని వివరించారు.
న్యూ సౌత్ వేల్స్ పోలీసుల విజ్ఞప్తి మేరకు నలుగురు రూకీ పోలీసులు ఓ చోటికి వెళ్లారు. ఆ నివాస ప్రాంతాల్లో ఎవరి పనుల్లో వారి నిమగ్నమై ఉన్నారు. కానీ, ఓ ప్రాపర్టీ వద్దకు చేరగానే పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తిప్పికొట్టడానికి ఆ పోలీసులకు సమయమే లేకపోయిందని క్వీన్స్‌లాండ్ పోలీసు యూనియన్ ప్రెసిడెంట్ ఇయనా్ లీవర్స్ తెలిపారు. ఇద్దరు పోలీసులను కోల్డ్ బ్లడ్‌లో మర్డర్ చేశారని వివరించారు. వీరితోపాటు ఓ పొరుగింటి పౌరుడు కూడా మరణించాడని పేర్కొన్నారు.
ఇది ఊహించిన విషాదం అని క్వీన్స్‌లాండ్ పోలీసు కమిషణర్ క్యాటరీనా కారొల్ వివరించారు. ఇటీవలి కాలంలో పోలీసులు ఎక్కువ ప్రాణనష్టం చవిచూసిన ఘటన ఇదేనని తెలిపారు. ఆ ఇద్దరు పోలీసులను కాపాడటానికి 16 మంది స్థానిక అధికారుల బృందం ప్రయత్నించిందని, ఆ తర్వాత స్పెషలిస్టు పోలీసులు వచ్చి ఆ ఆపరేషన్ టేకప్ చేశారని వివరించారు.
ఈ కాల్పులు కొన్ని గంటల వరకు జరిగిందని, అనుమానితులు ఇద్దరు పురుషులు, ఒక మహిళ పోలీసుల కాల్పుల్లో మరణించారని వివరించారు. ప్రాపర్టీ వద్దకు పోలీసులను రప్పించుకున్నారా? లేక ఇంకేమైనా వ్యూహం ఉన్నదా? అనే విషయాలను దర్యాప్తు చేస్తామని, రెండు హత్యలపైనా దర్యాప్తు ఉంటుందని తెలిపారు. అక్కడ చాలా ఆయుధాలు దొరికాయని వివరించారు.