అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించనున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాషింగ్టన్ లో రెండు వారాల పాటు ఎమర్జెన్సీ విధించారు. వారం రోజుల క్రితం ట్రంప్ మద్దతుదారులు నానా బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే.

క్యాపిటల్‌ హిల్‌ బిల్డింగ్‌ మీద దాడి చేయడమే కాక ప్రభుత్వ ఆస్తులను నాశనం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం సమయంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా.. ముందు జాగ్రత్తగా చర్యగా ట్రంప్‌ వాషింగ్టన్‌లో ఎమర్జెన్సీ విధించారని వైట్‌హౌస్‌ ప్రెస్‌ ఆఫీస్‌ సోమవారం వెల్లడించింది. 

‘ఈ రోజు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. 59వ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి 11 నుంచి 24 వరకు ఎమర్జెన్సీ ప్రకటించారు. గత వారం ట్రంప్‌ మద్దతుదారలు క్యాపిట్‌ల హిల్‌పై దాడి చేయడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ఫెడరల్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది’ అని ప్రకటనలో ఉంది.

జో బైడెన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ట్రంప్‌ మద్దతుదారులు ఈ వీకెండ్‌, జనవరి 20న మొత్తం 50 రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోన్నట్లు ఎఫ్‌బీఐ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. ఈ మేరకు పెంటగాన్‌ వాషింగ్టన్‌ సిటీలో మరోసారి దాడులు జరగకుండా చూడాలనే ఉద్దేశంతో క్యాపిటల్‌ సిటీలో 15 వేల మంది జాతీయ భద్రతా దళాలను మోహరించింది.