మన చుట్టూ ఉన్న వారిలో కొన్ని కుటుంబాలను చూస్తే వారికి ఏదో శాపం ఉన్నట్లుగా అనిపిస్తూ వుంటుంది. ఎప్పుడూ ఎవరో ఒకరు అనారోగ్యంతో ఉండటమో, చిన్నవయసులోనే ఎవరో ఒకరు చనిపోవడమో, ఆ కుటుంబంలోని వారికే తరచుగా ప్రమాదాలు జరుగుతుండటం చూస్తూనే ఉంటాం.

ఇలాంటి దురదృష్ట కుటుంబమే అమెరికా మాజీ అధ్యక్షుడి దివంగత జాన్ ఎఫ్.కెనెడీది. ఆయన ఫ్యామిలీలో ఏ ఒక్కరు కూడా నిండు నూరేళ్లు హాయిగా జీవించలేదు. అన్ని అకాల చావులే, అవి కూడా దుర్మరణాలే. జాన్ ఎఫ్ కెనెడీ ఆయన సోదరుడు సెనెటర్ రాబర్ట్ కెనెడీలను దుండగులు అత్యంత కిరాతకంగా కాల్చి చంపిన సంగతి తెలిసిందే.

వారి పెద్ద సోదరుడు జోసెఫ్ కెనడీ రెండోప్రపంచ యుద్ధంలో మరణించాడు. వారి సోదరి కథ్లీన్ కెవెన్‌డిష్ విమాన ప్రమాదంలో కన్నుమూశాడు. జాన్ కెనడీ కుమారుడు 1999లో విమానం కూలిపోయి మరణించాడు. అతనితో పాటు భార్య, సోదరి సైతం ప్రాణాలు కోల్పోయారు.

ఇక కెనెడీ సోదరుడు, రాబర్ట్ కెనెడీ మనవరాలు సీర్సా కెనెడీ అతిగా మందులు వాడి గురువారం రాత్రి చనిపోయారు. తాను మానసిక ఒత్తిడితో ఎలా కుంగిపోయిందో వివరిస్తూ 2016లో సీర్సా రాసిన వ్యాసం అమెరికాలో సంచలనం సృష్టించింది.

ఆమె తండ్రి పాల్ మైఖేల్ హిల్ ఐర్లాండ్ వాసి. ఐరిష్ రిపబ్లిక్ జరిపిన బాంబు దాడుల్లో ఆయన పాత్రపై బ్రిటన్ ప్రభుత్వం పెట్టిన కేసులో ఆయన దోషిగా తేలడంతో న్యాయస్థానం హిల్‌కు యావజ్జీవ శిక్ష విధించింది. అయితే 1993లో న్యాయస్థానం ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది.