మెట్రో ట్రైన్ ఎక్కిన వారికి.. ఉచితంగా నూడిల్స్ ఇస్తామంటున్నారు. కాకపోతే ఇది మనదగ్గర కాదులేండి.. టోక్యోలో. ఉదయాన్నే మెట్రో ట్రైన్ ఎక్కితే.. ఉచితంగా రెండు బౌల్స్ నూడిల్స్ ఇస్తామని  టోక్యో మెట్రో ప్రకటించింది. ఇంతకీ ఈ ప్రకటన ఎందుకు చేసిందో తెలుసా?  టోక్యో మెట్రోలో రోజుకు 72 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ఉదయం ఆఫీసుకు వెళ్లే సమయంలో రద్దీ విపరీతంగా ఉంటుంది. సామర్థ్యానికి దాదాపు రెండింతలు ప్రయాణిస్తారు.

కనీసం ఊపిరి కూడా ఆడనంతగా జనాలు మెట్రో ఎక్కేస్తున్నారట.  అలా కాకుండా ఉదయమే కొంచెం ముందుగా ఆఫీసుకు బయలుదేరేవారి సంఖ్యను పెంచేందుకే టోక్యో మెట్రో ఫ్రీఫుడ్‌ ఆఫర్‌ ప్రకటించింది. అందరూ ఒక్కసారిగా ఎగబడకుండా కనీసం కొందరైనా ఫ్రీ నూడిల్స్‌ కోసం ముందుగా ప్రయాణిస్తే తర్వాత ఆఫీసు వేళల్లో రద్దీ తగ్గుతుందనేది వారి ఆలోచన. ముందస్తు ప్రయాణికుల సంఖ్య 2,500 వరకు ఉంటే వారికి ఉచితంగా ఒక్కొక్కరికి సోబా నూడిల్‌ బౌల్‌ ఇస్తారు. ఆ సంఖ్య 3,000 దాటితే సోబాతోపాటుగా టెంపూరా బౌల్‌ ఇస్తారు. ఈ నూడిల్స్ ఆఫర్ బలేగా ఉంది కదూ..