కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ ను ఎదుర్కోవడానికి అగ్రరాజ్యం అమెరికాకు హైడ్రాక్సీక్లోరోక్వీన్ అవసరం కాగా.. దానిని అందించేందుకు భారత ప్రభుత్వం అంగీకరించింది. తొలుత భారత్ దీనిపై నిషేధం విధించగా... ట్రంప్.. ప్రతీకారం తీర్చుకుంటానంటూ కాస్త కటువుగా స్పందించాడు.

ఈ క్రమంలో భారత్ కాస్త వెనక్కి తగ్గి.. అమెరికాకు అవసరమైన ఔషధాన్ని ఇవ్వడానికి అంగీకరించింది. దీంతో.. వెంటనే ట్రంప్ స్వరం మార్చి.. భారత ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. కాగా.. ట్రంప్ ప్రశంసలపై మోదీ తాజాగా స్పందించారు.

 

కరోనా వైరస్ మహమ్మారిపై కలిసికట్టుగా విజయం సాధిద్దామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి పిలుపునిచ్చారు. కోవిడ్-19పై జరుగుతున్న పోరాటంలో భారత్‌ తరపున సాధ్యమైనవన్నీ చేసేందుకు సిద్ధమని ఆయన తెలిపారు. మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరోక్వీన్ (హెచ్‌సీక్యూ) మాత్రల ఎగుమతిపై నిషేధం సడలించడంపై ప్రధాని మోదీకి ట్రంప్ ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. 

దీనిపై ప్రధాని స్పందిస్తూ... ‘‘అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇలాంటి పరిస్థితులు మిత్రులను మరింత దగ్గర చేస్తాయి. భారత్-అమెరికా బంధం ఎప్పటికీ దృఢంగా ఉంటుంది. కోవిడ్-19పై మానవాళి పోరాటంలో భారత్ సాధ్యమైన ప్రతి సహాయం చేస్తుంది. కలిసికట్టుగా ఈ పోరాటంలో మనం విజయం సాధించాలి..’’ అని వ్యాఖ్యానించారు. 

కాగా అమెరికాకు హెచ్‌సీక్యూ మాత్రల ఎగుమతికి అనుమతించిన ప్రధాని మోదీ ‘‘అద్భుతమైన నాయకుడు’’ అంటూ ట్రంప్ అంతకు ముందు ట్విటర్లో కొనియాడారు. ఇలాంటి విపత్కర సమయంలో భారత్ చేసిన సాయం ‘‘ఎప్పటికీ మర్చిపోలేనిది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.