మూడేళ్ల బాలికను ఓ కోతి ఎత్తుకెళ్లింది. ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను ఓ కోతి దాడి చేసి రెండు చేతులతో గట్టిగా కరుచుకుని లాక్కెళ్లింది. ఈ ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

న్యూఢిల్లీ: ఇంటి వెలుపల తన చిట్టి స్కూటర్‌తో ఆడుకుంటున్న ఓ చిన్నారిని వానరం కిడ్నాప్ చేయ ప్రయత్నించింది. వీధిలో ఎవరూ లేనిది గ్రహించి అదును చూసి ఒక్క ఉదుటున ఆ బాలికపై దూకి దాడి చేసింది. తన రెండు చేతులతో ఆ బాలికను నేలపై దారుణంగా లాక్కెళ్లింది. తల్లి ఇంటి లోపల వంట చేస్తుండటంతో ఈ ఘటనను ఆమె చూడలేదు. కానీ, ఆ సమయంలో పొరుగునే ఉన్న ఓ వ్యక్తి చురుకైన చూపుతో ఆ బాలిక ప్రాణాలు దక్కించుకుంది. పొరుగునే ఉన్న వ్యక్తి వెంటనే బాలికను లాక్కెళ్తున్న వానరం వెంట పరుగు పెట్టాడు. వానరాన్ని వారించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ కోతి బాలికను మధ్యలోనే వదిలిపెట్టి పారిపోయింది. ఈ ఘటన చైనాలోని చోంగ్‌కింగ్‌లో జరిగింది.

ఆ మూడేళ్ల బాలిక తల్లి లియూ ఆ సమయంలో వంట చేస్తున్నట్టు వివరించారు. తన కూతురిని కోతి ఎత్తుకెళ్లిందన్న విషయాన్ని పొరుగు వారు చెబితే తెలిసింది. ఆ బాలిక ప్రాణాలతో దక్కింది. కానీ, ఆమె చర్మంపై కోతి గాట్లు పడ్డాయి. నేలపై ఆమెను లాక్కెళ్లడంతో పలుచోట్ల గాయాలయ్యాయి. తన కూతురిని ఎలా లాక్కెళ్లిందన్న విషయంపై లియూకు క్లారిటీ లేదు. కానీ, సీసీటీవీ చూసిన తర్వాత ఆ భయానక ఘటనపై ఆందోళన చెందింది. ఆ సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

Scroll to load tweet…

ఈ ఘటనను స్థానిక అధికారులకు తెలియజేసింది. స్థానిక అధికారులు ఈ ఘటనను ధ్రువీకరించారు. ఆమెకు అవసరమైన చికిత్స అందిస్తామని, టీకా కూడా వేస్తామని వివరించారు.

ఇదే కోతి గతంలో పలువురు గ్రామస్తులపై దాడి చేసినట్టు స్థానికులు తెలిపారు. అయితే, చిన్నపిల్లలపై దాడి చేయడం మాత్రం ఇదే తొలిసారి అని వివరించారు. ఈ కోతి తమ గ్రామంలోకి తొలిసారి గత మే నెలలో వచ్చిందని చెప్పారు. ఆ కోతి మరో రెండు చిన్న కోతులతో జట్టు కట్టి అప్పుడప్పుడు అరాచకం సృష్టిస్తున్నదని తెలిపారు.

స్థానిక పోలీసు అధికారి కూడా ఈ ఘటనపై స్పందించారు. సమీపంలోని పర్వత ప్రాంతం నుంచి ఈ కోతి గ్రామంలోకి తరుచుగా వస్తున్నదని వివరించారు. ఓ సారి గతంలో ఇది ఓ పెద్ద మనిషిపై దాడి చేసిందని, కానీ, వయోజనులకు దగ్గరగా రావాలంటే భయపడుతుందని తెలిపారు. ఈ కోతిని పట్టుకోవడానికి స్థానిక పోలీసులు చాలా సార్లు ప్రయత్నించి విఫలమైనట్టు చెప్పారు. ఒక సారి అది దొరకగానే జంతు సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని పేర్కొన్నారు. సమీప కొండ ప్రాంతంలో ఎన్ని కోతులు ఉన్నాయో చెప్పలేమని తెలిపారు. అయితే,
ఈ గ్రామంలో చిన్నారుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో కోతులతో ముప్పు ఎక్కువగానే ఉంటుందని వివరించారు.