వృద్ధులు ఉంటున్న ఇంట్లోకి చొరబడి చోరీ చేేసిన ఆ దొంగోడిని పట్టుకునేందుకు ఆ పోలీసు జాగిలం తీవ్రంగా పోరాడింది. దాని నుంచి తప్పించుకునేందుకు ఆ దొంగ ఏకంగా దానినే కరిచాడు. దీంతో అది తీవ్రగాయాలపాలైంది. ఈ ఘటన కాలిఫోర్నియాలో జరిగింది.

ఏంటి మ‌నిషి కుక్క‌ను క‌రిచాడా ? అవును.. మీరు చ‌దివింది నిజ‌మే. సాధార‌ణంగా కుక్క మ‌నిషిని క‌రిస్తే వార్త కాద‌ని, కానీ కుక్క‌నే మ‌నిషి క‌రిస్తే అది వార్త అవుతుంద‌ని చెబుతుంటారు. దానిని అక్ష‌రాల నిజం చేశాడో ఓ వ్య‌క్తి. ఈ ఘ‌ట‌న అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. అస‌లు మ‌నిషి కుక్క‌ను క‌రిచేంత అవ‌స‌రం ఏమొచ్చింది ? అత‌డు ఎలాంటి ప‌రిస్థితుల్లో ఈ ప‌ని చేశాడు ? త‌రువాత ఏం జ‌రిగింది ? ఈ విష‌యాల‌న్నీ తెలుసుకోవాలంటే వెంట‌నే ఇది చ‌దివేయండి..

కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫెయిర్‌ఫీల్డ్ న‌గ‌రంలో వృద్ధులు నివ‌సిస్తున్న ఓ ఇంట్లోకి వెళ్లి చోరీ చేయాల‌ని ఓ దొంగ ప్లాన్ చేసుకున్నాడు. అనుకున్న ప్ర‌కారమే ఆ ఇంట్లోకి చొర‌బ‌డ్డాడు. వ‌చ్చిన ప‌నిని విజ‌యవంతంగా పూర్తి చేసుకున్నాడు. ఆ దోచుకున్న సొత్తును త‌నతో పాటు బ‌య‌ట‌కు తీసుకెళ్దామ‌నుకున్నాడు. అయితే అదే స‌మ‌యంలో ఆ ఇంటికి అమెజాన్ డెలివ‌రీ బాయ్ రావ‌డంతో త‌న ప్లాన్ మారిపోయింది. చోరీ సొమ్మును తీసుకెళ్లేందుకు ఆమెజాన్ బాయ్ తీసుకొచ్చిన ట్రక్ ను ఉప‌యోగించుకోవాల‌ని అనుకున్నాడు. ఇక్క‌డే అస‌లు క‌థ మొద‌లైంది. 

ఆమెజాన్ డెలివరీ బాయ్ ను దొంగ బెదిరించాడు. వెహికిల్ తాళాలు ఇవ్వాల‌ని లేక‌పోతే చంపేస్తాన‌ని చెప్పాడు. అయినా అత‌డు బ‌య‌ప‌డ‌క‌పోవ‌డంతో గొంతుపై క‌త్తి పెట్టాడు. దీంతో ఆ డెలివ‌రీ బాయ్ స‌మ‌య‌స్ఫూర్తితో ఆలోచించాడు. దొంగోడికి క‌నిపించ‌కుండా మెళ్ల‌గా పోలీసుల‌కు కాల్ చేశాడు. అక్క‌డ నెల‌కొన్న ప‌రిస్థితిని వారికి ఎలాగోలా వివ‌రించాడు. ఇంకేముంది కొన్ని నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఇదంతా చూస్తున్న ఆ దొంగ‌కు ఏం అర్థం కాలేదు. పోలీసులు ఎలా వ‌చ్చారో తెలియలేదు. దీంతో ఆ దొంగ ప‌రేశాన్ అయ్యి వెంట‌నే ఆ ఆమెజాన్ డెలివ‌రీ బాయ్ ను బ‌య‌టే విడిచిపెట్టి దొంగ‌త‌నం చేసిన ఆ ఇంట్లోకే ప్ర‌వేశించాడు. 

ఆ ఇంటి చుట్టూ పోలీసులు మోహ‌రించారు. ఆ ఇంట్లో నుంచి ఆ దొంగోడిని బ‌య‌ట‌కు తీసుకురావ‌డం వారికి సాధ్యం కావ‌డం లేదు. ఇంటి త‌లుపులు కూడా ఓపెన్ కావ‌డం లేదు. అప్పుడే వారికొక ఐడియా వచ్చింది. దొంగ‌ను ప‌ట్టుకోవ‌డానికి కార్డ్ (K9) అనే జాగిలాన్ని ఉప‌యోగించుకోవాల‌ని అనుకున్నారు. అనుకున్న‌దే త‌డ‌వుగా ఆ కుక్కను ఆ ఇంటి దొడ్డిదారి నుంచి లోప‌లికి పంపించారు. నేర‌స్తుల అంతుచూడ‌టంలో నేర్పరి అయిన ఆ కుక్క వెంట‌నే త‌న ప‌ని మొద‌లుపెట్టింది. పరుగుప‌రుగున వెళ్లి ఆ దొంగ‌ను ప‌ట్టేసుకుంది. 

ఇదే స‌మయంలో బ‌య‌ట‌వైపు నుంచి తలుపులు బ‌ద్ద‌లు గొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. వారి ప్ర‌య‌త్నం ఫ‌లించించ‌డంతో ఇంట్లోకి ప్ర‌వేశించారు. అయితే వారి క‌ళ్ల ముందు క‌నిపించిన దృశ్యం చూసి వారు ఖంగుతిన్నారు. ఆ స‌మ‌యంలో ఆ దొంగోడు కుక్కను కరుస్తున్నాడు. కత్తితో కూడా పొడుస్తూ దాని బారి నుంచి తప్పించుకొని పారిపోదామనుకుంటున్నాడు. దీనిని గ‌మ‌నించి పోలీసులు ఒక్కసారిగా దొంగ మీదికి దూకారు. అత‌డికి బేడీలు వేసి త‌మ వెంట ప‌ట్టుకెళ్లారు. 

గాయాల‌పాలైన K9 ను చికిత్స కోసం హాస్పిట‌ల్ లో చేర్పించారు. ఆ దొంగ‌ను కూడా జాయిన్ చేశారు. అయితే కుక్క‌ను కరిచిన స‌మ‌యంలో ఆ దొంగ డ్ర‌గ్స్ తీసుకొని ఉన్నాడ‌ని, ఆ మ‌త్తులోనే ఈ దారుణానికి ఒడిగ‌ట్టాడ‌ని పోలీసులు వెల్ల‌డించారు. అత‌డిపై గ‌తంలోనే పోలీసులు కేసులు న‌మోదయి ఉన్న‌ట్టు చెప్పారు. తాజాగా దొంగ‌త‌నం కేసు, కుక్క‌ను క‌రిచినందుకు కూడా దొంగపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ విష‌యం ప్ర‌స్తుతం ట్రెండింగ్ గా మారింది.