అబుదాబిలో తొలి హిందూ దేవాలయం.. ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. లోపల ఎలా ఉందో చూడండి..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబుదాబిలో తొలిసారిగా హిందూ దేవాలయం నిర్మితమైంది. దీనిని బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ నిర్మించింది. ఈ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 14వ తేదీన ప్రారంభించనున్నారు.
అబుదాబిలో బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (బీఏపీఎస్) తొలి హిందూ దేవాలయం నిర్మించింది. ఈ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 14వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ ఆలయం యుఏఈలో మొట్టమొదటిది కావడం విశేషం. భారతీయ శాస్త్రీయ శైలిని మధ్యప్రాచ్య ప్రభావాలతో మిళితం చేస్తూ నిర్మించిన ఈ ఆలయాన్ని వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ విడుదల చేసింది.
హిందూ మత సాంస్కృతిక గొప్పతనానికి ప్రాతినిధ్యం వహించేలా దీనిని నిర్మించారు. అలాగే అబుదాబి వైవిధ్యమైన వాతావరణం కూడా అందులో కనిపిస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో రెండు రోజుల పర్యటనలో భాగంగా బీఏపీఎస్ మందిర్ ను ప్రధాని ప్రారంభించనున్నారు. దీనిపై యూఏఈలో భారత రాయబారి సుంజయ్ సుధీర్ మాట్లాడుతూ.. భారత్, గల్ఫ్ ప్రాంతాల మధ్య బలమైన సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక సంబంధాలకు ఈ ఆలయం ప్రతీకగా అభివర్ణించారు.
2015 యూఏఈ పర్యటనలో ప్రధాని మోడీ దార్శనికత నుంచి ఈ ఆలయం ఎలా ఆవిర్భవించిందని ఆయన చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, భారతీయ కళాకారులు, భక్తుల విరాళాలతో నిర్మించిన ఈ ఆలయం ఐక్యత, సహకారాన్ని చూపిస్తుందని సుధీర్ అన్నారు.
ఇటీవల జరిగిన ప్రివ్యూలో వివిధ దేశాలు, మతాలకు చెందిన రాయబారులను ఈ ఆలయం ఎంతగానే ఆకట్టుకుందని ‘ఏఎన్ఐ’ తెలిపింది. కాగా.. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడమే ఈ పర్యటన లక్ష్యమని, ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం, నేషనల్ అర్చివ్స్ అవగాహన ఒప్పందంతో సహా ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయని భావిస్తున్నారు. దీని వల్ల భారతదేశం, యూఏఈ మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలు మరింత మెరుగుపడుతాయి.