దేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది.  రోజూ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, సినీ తారలు కరోనా బారినపడ్డారు. తాజాగా ప్రముఖ వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ కూడా కోవిడ్ బారిన పడ్డారు.

ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్లో తెలిపారు. సుమారుగా ఒక సంవత్సరం నుంచి ఇంట్లోనే ఉన్న తనకు కరోనా ఎలా వచ్చిందనే విషయం అర్థం కావడం లేదని ఆవిడ ట్విట్టర్లో అన్నారు. 

కరోనా నేపథ్యంలో యేడాదికాలంలో ఇంట్లోకి ఎవరినీ రానివ్వ లేదని అన్నారామె. అయినా తనకు కరోనా సోకడం ఆశ్చర్యం కలిగిస్తోందని తస్లీమా పేర్కొన్నారు. తస్లీమా నస్రీన్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ మొదటి డోసు కూడా వేయించుకున్నారు.

కాగా దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల వ్యవధిలో 3.66లక్షల మంది కోవిడ్ బారినపడ్డారు.అంతక్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు దాదాపు 35 వేలకు పైగా తగ్గడం గమనార్హం. అయితే నిర్ధారణ పరీక్షలు తగ్గడం వల్లే కేసుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 

ఆదివారం కేవలం 14.7 లక్షల మందికే వైద్య పరీక్షలు చేశారు. అంతక్రితం రోజున 18.6 లక్షల మంది టెస్టులు చేయించుకున్నారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం ఎనిమిది గంటల వరకూ 14,74,606 మందికి కరోనా పరీక్షలు చేయించుకోగా.. 2,66,161 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.2 కోట్లకు చేరింది.

ఇదే సమయంలో 3,754 మంది కరోనాతో వృద్ధుడికి చేరుకున్నారు. దీంతో వైరస్ ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు 2, 46,116 మందిని కోవిడ్ బలితీసుకుంది. మరణాల రేటు 1.09 శాతంగా ఉంది.

అయితే కొత్త కేసులతో పాటు, రికవరీలు కూడా ఎక్కువగానే ఉండడం కాస్త సానుకూల పరిణామం. గడిచిన 24 గంటల్లో 3,53,818 మంది కరోనాను జయించారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1.86 కోట్లకు చేరగా.. రికవరీ రేటు 82.15 శాతానికి పెరిగింది.

ప్రస్తుతం 37,45, 237 మంది వైరస్ కు చికిత్స చేసి తీసుకుంటుండగా.. క్రియాశీల రేటు 16.76 శాతంగా ఉంది. దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నెమ్మదిగా సాగుతోంది. చాలా చోట్ల వ్యాక్సిన్ల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం కేవలం 6.89 లక్షల మందికే టీకాలు ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు 17.01 కోట్ల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.