Asianet News TeluguAsianet News Telugu

Taliban: భారత్‌కు రుణపడి ఉన్నామంటూనే తాలిబన్ల వార్నింగ్.. ‘మైనార్టీలకు ముప్పు లేదు’

ఆఫ్ఘనిస్తాన్‌ అభివృద్ధికి భారత్ చేసిన సహాయాన్ని తాలిబన్ ప్రశంసించింది. డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పన, అఫ్ఘాన్ ప్రజల సంక్షేమం కోసం భారత్ చేసిన విశేష కృషిని గౌరవిస్తున్నట్టు తెలిపింది. కానీ, తమ దేశంలోకి మిలిటరీపరమైన పాత్ర పోషించాలనుకుంటే ఆ భారత్‌కు మంచిది కాదని వార్నింగ్ ఇచ్చింది.

taliban warns india about military role in afghanistan
Author
New Delhi, First Published Aug 14, 2021, 1:17 PM IST

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్ మినహా దాదాపు దేశం మొత్తాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్న తాలిబన్లు ఆ దేశానికి భారత్ చేసిన సహాయానికి రుణపడి ఉన్నామంటూనే వార్నింగ్ ఇచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల సంక్షేమానికి, దేశాభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు భారత్ చేసిన సహాయాన్ని తాము గౌరవిస్తున్నామని తాలిబన్లు తెలిపారు. కానీ, ఆ దేశంలో మిలిటరీపరమైన పాత్ర పోషించాలనుకుంటే మంచిది కాదని స్వల్పస్థాయిలో హెచ్చరించింది.

ఖతర్‌లోని తాలిబన్ల ప్రతినిధి సుహేల్ షహీన్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ‘అఫ్ఘాన్ ప్రజల కోసం భారత్ చేసిన విశేష కృషికి రుణపడి ఉన్నాం. డ్యాముల నిర్మాణం, జాతీయ స్థాయి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు, ఇతర ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టినందుకు భారత్‌ను అభినందిస్తున్నాం. అఫ్ఘాన్ పునర్నిర్మాణానికి, ఆర్థిక వృద్ధికి తోడ్పడినందుకు ధన్యవాదాలు’ అని తెలిపారు.

కానీ, అఫ్ఘాన్‌లో మిలిటరీ రోల్‌ను ఆమోదించబోమని, ఇతర దేశాలకు ఎదురైన చేదు గుణపాఠమే భారత్‌కూ ఎదురవుతుందని హెచ్చరించారు. ‘అఫ్ఘాన్‌లో మిలిటరీ రోల్ అంటే? ఒకవేళ భారత్ మిలిటరీతో అఫ్ఘాన్ వస్తే.. ఇక్కడ వారి దళాలను దింపితే ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించం. అది వారికంత మంచిది కాదు. ఇతర దేశాలకు చెందిన బలగాలు అఫ్ఘాన్‌లో ఎదుర్కొన్న అనుభవాలు వారికి తెలిసిందే. అదే వారికి తెరిచిన పుస్తకం వంటిది. కానీ, అఫ్ఘాన్ అభివృద్ధికి భారత్ చేసిన సహాయాన్ని అభినందించాల్సిందే’ అని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.

దౌత్యసిబ్బందికి హాని తలపెట్టం
‘మేం ఇదివరకే చాలా సార్లు చెప్పాం. ఎంబసీలను, రాయబారులను లక్ష్యం చేసుకోం. ఇది మా కమిట్‌మెంట్. దౌత్య సిబ్బందికి మేం హాని తలపెట్టం. భారత్ వారి సిబ్బందిని వెనక్కి తీసుకోవడం ఆ దేశం నిర్ణయం. మా వైఖరి మాత్రం సుస్పష్టం. మేం దౌత్యసిబ్బందిని టార్గెట్ చేసుకోం’ అని వివరించారు. తాలిబన్లు కాబూల్‌వైపు వేగంగా దూసుకొస్తున్నతరుణంలో యూకే, యూఎస్ సహా పలుదేశాలు దౌత్యసిబ్బందిని స్వదేశాలకు తరలించే పనిలో నిమగ్నమయ్యాయి. యూకే, యూఎస్ దేశాలు తమ భద్రతా సిబ్బందినీ పంపి దౌత్యసిబ్బందిని వెనక్కి తీసుకెళ్లే పనిలో పడ్డాయి. భారత్ కూడా దౌత్యసిబ్బందిని స్వదేశానికి తెచ్చే పనిలో ఉన్నది.

సిక్కులు, హిందువులూ సేఫే
అఫ్ఘాన్‌లో మైనార్టీ మతస్తులు తమ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, క్రతువులు నిర్వహించుకోవచ్చని తాలిబన్ ప్రతినిధి సుహేల్ షహీన్ స్పష్టం చేశారు. పక్తియా ప్రావిన్స్‌లోని గురుద్వారాలో సిక్కుల జెండాను తొలగించడాన్ని ప్రస్తావించగా, సమాధానం తెలిపారు. ఆ జెండాను సిక్కులే తొలగించారని వివరించారు. మీడియాలో దీని గురించి వివరాలు ప్రసారం కాగానే తాలిబన్ ప్రతినిధులు అక్కడికి చేరుకుని ఆరా తీశారని తెలిపారు. గురుద్వారాకు వెళ్లి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారని వివరించారు. మైనార్టీలు తమ క్రతువులు, సంప్రదాయాలు పాటించుకోవచ్చునని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios