Asianet News TeluguAsianet News Telugu

Afghanistan : 81 శాతం భూభాగం తాలిబన్ల గుప్పిట్లో.. మిగిలింది రాజధాని కాబూలే.. !!

ఆ దేశ రాజధాని కాబూల్ కి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో దేశంలోని ముప్పావు వంతు భూభాగం తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయినట్లు కనిపిస్తోంది. అయితే 81 శాతం భూభాగం తమ గుప్పిట్లోనే ఉన్నట్లు తాలిబన్లు ప్రకటించారు. 

taliban occupied major land in afghan, kabul left
Author
Hyderabad, First Published Aug 13, 2021, 5:00 PM IST

కాబూల్ : గురువారం నాటికే ఆఫ్ఠనిస్తాన్ లోని 65 శాతం భూభాగాన్ని ఆక్రమించిన తాలిబన్లు శుక్రవారం దేశంలోని మరిన్ని పట్టణాల్ని, ప్రాంతాల్ని తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. తాజాగా లోగర్ ప్రావిన్స్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. కందహార్, హెరత్ నగరాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన గంటల్లోనే లోగర్ ప్రాంతాన్ని ఆక్రమించినట్లు ప్రకటించడం గమనార్హం. 

ఇది ఆ దేశ రాజధాని కాబూల్ కి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో దేశంలోని ముప్పావు వంతు భూభాగం తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయినట్లు కనిపిస్తోంది. అయితే 81 శాతం భూభాగం తమ గుప్పిట్లోనే ఉన్నట్లు తాలిబన్లు ప్రకటించారు. 

అమెరికా, నాటో సేనలు ఈ నెలాఖరుకు పూర్తిగా వైదొలగనున్న నేపథ్యంలో ఆఫ్ఠన్ క్రమంగా మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. మిలిటరీ బలగాలు సైతం తాలిబన్లకు లొంగిపోతున్నాయి. తాలిబన్లు కాందహార్‌ సెంట్రల్‌జైలును ఆక్రమించారు. 

ఇప్పటికే ఆఫ్ఘన్ లోని దాదాపు ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తాలిబన్లకు ఇక మిగిలింది దేశ రాజధాని కాబూలే. ఇక తాలిబన్లు మెరుపుదాడులకు అక్కడి ప్రభుత్వం రాయబారానికి దిగింది. మధ్యవర్తిగా ఉండాల్సిందిగా గల్ఫ్ దేశం ఖతార్ ను కోరింది. ఈ మేరకు గురువారం తాలిబన్లు, ఆఫ్ఘన్ రాయబార వర్గాలకు మధ్య చర్చలు జరిగినట్లు అల్ జజీరా వార్తా సంస్థ కథనాలు ప్రసారం చేసింది. 

మెరికా, నాటో బలగాలు ఉపసంహరణ మొదలైనప్పటి నుంచి తాలిబన్లు శరవేగంగా అఫ్ఘాన్ ప్రభుత్వ బలగాలపై పైచేయి సాధిస్తున్నారు. కీలక నగరాలను హస్తగతం చేసుకుంటూ దావానలంలా విస్తరిస్తున్నారు. తాజాగా, దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన కాందహార్‌ను ఆక్రమించుకున్నారు. అనంతరం అంతే వేగంగా మూడో అతిపెద్ద నగరమైన హెరాత్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు హెరాత్ అంతర్జాతీయ విమానాశ్రయం వారి కంట్రోల్‌లోకి వెళ్లిపోయింది. ఎయిర్‌పోర్టులోని సిబ్బంది తాలిబన్లకు లొంగిపోయారు.

కాందహార్‌, మరో నగరం లష్కర్ గాహ్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్నట్టు తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఈ ప్రకటనను అఫ్ఘాన్ భద్రతబలగాలకు చెందిన సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. తాలిబన్ల దూకుడును దృష్టిలో పెట్టుకుని హెరాత్‌ నుంచి ముందుగానే అఫ్ఘాన్ బలగాలు సురక్షిత ప్రాంతాలకు వెనుదిరిగాయి. అనంతరం స్వల్ప వ్యవధిలోనే తాలిబన్లు హెరాత్‌ను ఆక్రమించుకున్నారు. హెరాత్‌ను ఆక్రమించుకున్నాక గంటల వ్యవధిలోనే కాందహార్, లష్కర్ గాహ్‌ను స్వాధీనపరుచుకున్నట్టు ప్రకటించుకున్నారు.

తాలిబన్ల కంట్రోల్‌లోకి కాందహార్.. సంక్షోభంలో ప్రభుత్వం!

మే నెల నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ ప్రారంభమైనప్పటి నుంచి తాలిబన్లు దూకుడు పెంచినప్పటికీ గతవారంలో అఫ్ఘాన్ ప్రభుత్వ కీలక భూభాగాలపై పట్టుకోల్పోయింది. వారం రోజుల్లోనే ఉత్తర, దక్షిణ, పశ్చిమ అఫ్ఘానిస్తాన్‌లో చాలా వరకు తాలిబన్లు ఆక్రమించుకున్నారు. కాబూల్‌కు 90 మైళ్ల దూరంలోని కీలకమైన ఘజనీ సెంట్రల్ సిటీని గురువారం సీజ్ చేశారు. 

ప్రస్తుతం తూర్పువైపున పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని మజార్-ఈ-షరీఫ్, జలాలాబాద్‌లతోపాటు కాబూల్‌ నగరాలు ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. దీంతో అఫ్ఘాన్ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయినట్టు స్పష్టమవుతున్నది. మరో 30 రోజుల్లో రాజధాని నగరం కాబూల్‌ నుంచి భద్రతా దళాలను తాలిబన్లు బయటికిపంపే ముప్పు ఉన్నట్టు నిఘా వర్గాలను పేర్కొంటూ అమెరికా రక్షణ శాఖ అధికారులు తెలిపారు. 90 రోజుల్లో కాబూల్‌నూ తాలిబన్లు తమ అధీనంలోకి తెచ్చుకునే అవకాశముందని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios