తైవాన్: చికెన్... ఈ పేరు వింటేచాలు నాన్ వెజ్ ప్రియుల నోళ్లలో నీరు ఊరుతాయి. కానీ కొందరికి ఇదంటే ప్రాణం. కానీ రోడ్డు ప్రమాదానికి గురయి కోమాలోకి వెళ్లిన ఓ యువకుడు చికెన్ పేరు వినగానే టక్కున లేచాడంటే అతడికి అదంటే ఎంత ఇష్టమో అర్థమవుతోంది. ఈ ఘటన తైవాన్ లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... తైవాన్ లోని సించూ కౌంటీకి చెందిన ఓ యువకుడు బైక్ పై వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు. ఇలా రెండు నెలలుగా వైద్యులు ఎంత ప్రయత్నించినా అతడిని కోమా నుండి బయటపడేయలేకపోయారు. దీంతో ఆశ వదిలేసిన సమయంలో ఓ అద్బుతం జరిగి అతడు కోమాలోంచి బయటకు వచ్చాడు. 

కోమాలో వున్న యువకుడి‌ పక్కన  కూర్చుని సోదరుడు చికెన్‌ ఫిల్లెట్‌ తినడానికి వెళ్తున్నానని చెప్పాడు. అయితే కోమాలో వున్న యువకుడికి చికెన్ అంటే అమితంగా ఇష్టం వుండటంతో ఆ మాటలకు అతడి శరీరం స్పందించింది. చికెన్ అన్న పేరు వినగానే అతడి ఫల్స్ రేట్ పెరిగింది. దీన్ని గమనించిన సోదరుడు వైద్యులకు సమాచారం అందించాడు. 

వైద్యులు వెంటనే అక్కడికి చేరుకుని వైద్యం అందించారు. దీంతో కోమా నుండి బయటపడి స్పృహలోకి వచ్చాడు. ఇలా చికెన్ కారణంగా యువకుడి ఆరోగ్యం బాగుపడటంతో అతడి కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.