ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపాలు సంభవించాయి. అయితే ఎలాంటి సునామీ ముప్పు లేదని రెండు దేశాలకు చెందిన అధికారులు వెల్లడించారు.

పశ్చిమ ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపాలు సంభవించాయి. భూకంపాల ధాటికి భవనాలు ఊగడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. కానీ ఎటువంటి ప్రాణ నష్టం నమోదు కాలేదని సమాచారం. ఇండోనేషియా సుమత్రా ద్వీపం పశ్చిమ తీరంలో రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. మరోవైపు ఫిలిప్పీన్స్‌లోని లుబాంగ్ ద్వీపానికి 110 కి.మీ(68 మైళ్ల) దూరంలో రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వివరాలను తెలిపింది. ఇక, ఈ భూకంపాల వల్ల ఎటువంటి ప్రాణ నష్టం చోటుచేసుకోలేదని రెండు దేశాలకు చెందిన అధికారులు తెలిపారు. సునామీ ముప్పు లేదని చెప్పారు. 

ఇండోనేషియాలో సుమత్రా దీవిలో స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామన 4.06 గంటలకు భూకంపం సంభవించింది. సుమత్రాలోని Pariaman city నగరానికి భూకంప కేంద్రం ఉండగా.. భూ అంతర్భాగంలో 21 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయి. ‘ఒక నిమిషం పాటు భూమి బలంగా కంపించినట్టుగా అనిపించింది. దీంతో ఆ ప్రాంతంలోని నివాసితులు భయాందోళనలకు గురయ్యారు’ అని ఇండోనేషియా నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ (BNPB) ఒక ప్రకటనలో తెలిపింది.

ఫిలిప్పీన్స్ రాజధాని ప్రాంతంతో పాటు వెలుపలి ప్రావిన్సులలో కూడా ఈ తెల్లవారుజామున సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతగా నమోదైంది. అయితే భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం లేదా గాయాలు సంభవించలేదని ఫిలిప్పీన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాల్కనాలజీ అండ్ సీస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం Occidental Mindoro province‌లోని లుబాంగ్ ద్వీపానికి 110 కిలోమీటర్ల దూరంలో ఉందని.. 28 కి.మీ లోతులో ప్రకంపనలు వచ్చాయని వెల్లడించింది. 

ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లు పసిఫిక్ Ring of Fire వెంబడి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో తరుచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. అగ్నిపర్వత విస్పోటనాల ప్రభావం కూడా ఈ ప్రాంతాలపై అధికంగానే ఉంటుంది. ఇక, గత నెలలో ఇండోనేషియాలోని పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌లో రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం వల్ల కనీసం 16 మంది మరణించగా.. 400 మందికి పైగా గాయపడ్డారు.