కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రతిరోజూ వేలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా.. దీనికి మందు ఎప్పుడు దొరుకుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  అయితే.. ఓ రకం స్టెరాయిడ్స్ వాడటం వల్ల కరోనా మరణాల రేటు తగ్గుతోందని నిపుణులు చెబుతున్నారు.

డెక్సామెథాసోన్(Dexamethasone) అనే స్టెరాయిడ్ వాడకం వలన కరోనా అనారోగ్యంతో బాధ పడుతున్న వారికి ప్రభావ వంతంగా పనిచేస్తోందని యూకే పరిశోధకులు తేల్చారు. డెక్సామెథాసోన్ వల్ల కరోనా రోగుల మరణాల రేటు మూడింట ఒక వంతు తగ్గింది. ఏడు అంతర్జాతీయ ట్రయల్స్ అనంతరం పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. ఈ మందుని కరోనా రోగులకు అందజేస్తే.. ప్రాణాలు పోయే రిస్క్ నుంచి దాదాపు 20శాతం బయటపడినట్లేనని వారు చెబుతున్నారు. 

2104 మంది రోగులకు ట్రయల్స్ కోసం ర్యాండంగా ఈ మందులను ప్రయోగించారు. అయితే వీరిలో రికవరీని సీరియస్ సమస్య ఎదుర్కొంటున్న 4321 మంది రోగులతో పోల్చి చూశారు. ఔషధ వినియోగం తరువాత, వెంటిలేటర్ ద్వారా చికిత్స పొందుతున్న రోగుల మరణాల రేటు 35 శాతం తగ్గింది. ఆక్సిజన్ సహాయం అందిస్తున్న వ్యక్తుల మరణ రేటును 20 శాతం తగ్గినట్లు గుర్తించారు. "ఇవి చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు" అని పరిశోధకులు  చెబుతున్నారు.

వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న రోగులను మరణం నుంచి బయటపడేసేందుకు ఈ మందు ఉపయోగపడుతుందన్నారు. అయితే క్రిటికల్ కండీషన్ లోఉన్న రోగులలో మాత్రమే ఈ  డెక్సామెథాసోన్ వాడాలని చెబుతున్నారు.  డెక్సామెథాసోన్ చాలా తక్కువ ధరకే లభించే స్టెరాయిడ్ కావడం గమనార్హం.