భారత్, శ్రీలంక మధ్య చిరకాల సంబంధాలు ఉన్నాయని, తన హయాంలో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లాలనుకుంటున్నట్టు శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స ఆశాభావం వ్యక్తం చేసారు. 

ఇటీవల శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం తొలి విదేశీ పర్యటనలో భాగంగా భారత్‌కు విచ్చేసిన రాజపక్స మీడియాతో మాట్లాడుతూ, ఇరుదేశాల ఆర్థికాభివృద్ధి, ప్రజల భద్రతకు కొలంబో, న్యూఢిల్లీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

శ్రీలంక అభివృద్ధికి భారత్‌ పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశ ఆర్థిక అభివృద్ధికి, ఉగ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు శ్రీలంకకు 450 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం అందజేయనున్నట్టు మోదీ ప్రకటించారు. 

Also read: తెరపైకి శివాజీ.. హిందుత్వ స్థానేనా లౌకికత్వం..ఆసక్తికరంగా మహా రాజకీయం

మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని మోదీతో రాజపక్స భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల అభివృద్ధి, ఉగ్రవాదం నివారణకు చేపట్టాల్సిన చర్యలపై ఇరువురు నేతలు చర్చించారు. 

అనంతరం మోదీ మాట్లాడుతూ, శ్రీలంకతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి భారత్‌ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఏప్రిల్‌ 21 ఈస్టర్‌ రోజున శ్రీలంకలో జరిగిన దాడులను ఖండించిన మోదీ, ఉగ్రవాదం పై పోరులో భాగంగా శ్రీలంకకు 50 మిలియన్‌ డాలర్లు అందజేయనున్నట్టు తెలిపారు. 

అలాగే  శ్రీలంక ఆర్థిక వృద్ధి కోసం 400 మిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించారు. ఇండియన్‌ హౌసింగ్‌ ప్రాజెక్టు కింద శ్రీలకంలో ఇప్పటికే 46,000 గృహాలు నిర్మించామని, భవిష్యత్తులో మరో  14,000 గృహాలు నిర్మిస్తామని తెలిపారు. 

శ్రీలంక ఎన్నికల్లో విజయం సాధించిన రాజపక్సకు అభినందనలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. రాజపక్స మాట్లాడుతూ, శ్రీలంక అభివృద్ధికి భారత్‌ ముందుకు వచ్చినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. 

నిఘా వర్గాలను మరింత శక్తివంతం చేసేందుకు ప్రధాని మోదీ 50 మిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. ఇరు దేశాల మధ్య   ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి కృషి చేస్తానని తెలిపారు. 

Also read: పాకిస్తాన్ లో మరో సైనిక తిరుగుబాటును చూస్తున్నామా?

శ్రీలంక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది నా మొదటి విదేశీ పర్యటన. భారత ప్రభుత్వానికి, రాష్ట్రపతికి, ప్రధానికి నా కృతజ్ఞతలు' అని రాజపక్స అన్నారు. ఎన్నో అంచనాలతో తాను భారత్‌ పర్యటనకు వచ్చానని, ఒక దేశాధ్యక్షుడిగా తన హయాంలో ఇరుదేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని కోరుకుంటున్నానని, ఇరుదేశాల మధ్య చిరకాలంగా బలమైన మైత్రీ, సాంస్కృతిక, రాజకీయ సంబంధాలున్నాయని చెప్పారు.

రాజపక్సకు రాష్ట్రపతి భవన్‌ వద్ద రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సాదర స్వాగతం పలికారు. అనంతరం భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్‌ను రాజపక్స కలుసుకున్నారు. శనివారంనాడు ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రాజపక్స తిరిగి శ్రీలంక బయలుదేరి వెళ్తారు.