Sri Lanka crisis: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం మరింతగా ముదురుతోంది. ప్రమాణ స్వీకారం చేసిన ఒక రోజు తర్వాత ఆ దేశ ఆర్థిక మంత్రి అలీ సబ్రీ రాజీనామా చేశారు. అంతకు ముందే శ్రీలంక క్యాబినెట్ మూకుమ్మడిగా 26 మంది మంత్రులు రాజీనామా చేశారు.
Sri Lanka crisis: అప్పుల ఊబిలో చిక్కుకున్న శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం మరింతగా ముదురుతోంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్సకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తూ.. రాజపక్స కుటుంబ రాజకీయ నాయకులను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో శ్రీలంక కొత్త ఆర్థిక మంత్రి అలీ సబ్రీ ప్రమాణ స్వీకారం చేసిన ఒక రోజు తర్వాత మంగళవారం (ఏప్రిల్ 5) రాజీనామా చేశారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంపై పెరుగుతున్న ప్రజల అశాంతి మధ్య ఆయన రాజీనామా దేశ పరిస్థితులపై మరింత ప్రభావం చూపే అవకాశాలున్నాయి. "నేను తక్షణమే ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను" అని రాష్ట్రపతికి రాసిన లేఖలో అలీ సబ్రీ తెలిపారు.
తాత్కాలిక చర్యలో భాగంగానే తాను ఆర్థిక మంత్రి పదవిని చేపట్టినట్టు రాష్ట్రపతికి రాసిన లేఖలో అలీ సబ్రీ తెలిపారు. "అసౌకర్యానికి చింతిస్తున్నాను, నేను ఎల్లప్పుడూ దేశ ఉత్తమ ప్రయోజనాల కోసం పనిచేశాను అని నేను నమ్ముతున్నాను" అని సబ్రీ అన్నారు. దేశ సమస్యలను పరిష్కరించడానికి 'తాజా మరియు క్రియాశీల, సాంప్రదాయేతర చర్యలు' అవసరమని అన్నారు. అలీ సబ్రీ గతంలో న్యాయశాఖ మంత్రిగా కొనసాగారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)తో చర్చించడానికి అతను ఈ నెలాఖరులో యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే, ఈ సమయంలో ఆయన రాజీనామా చేయడం ఆ శ్రీలంక పరిస్థితులను మరింత దిగాజారుస్తుందనడంలో సందేహం లేదు.
కాగా, సంక్షోభం నేపథ్యంలో శ్రీలంక మంత్రివర్గం ఆదివారం అర్థరాత్రి వరకు సాగిన సమావేశం అనంతరం.. సంచలన నిర్ణయం తీసుకుంది. 26 మంది మంత్రులు తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి తెలిపారు. అయితే, మహింద రాజపక్సే ప్రధానిగా కొనసాగుతారు. శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేయలేదని ఆయన కార్యాలయం ఆదివారం రాత్రి పేర్కొంది. మహింద రాజపక్స రాజీనామా వార్తలను కొట్టి పారేసింది. ఆయనకు అటువంటి ప్రణాళికలే లేవని శ్రీలంక పీఎంవో తేల్చేసింది.
ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడు రాజపక్సే సోమవారం నియమించిన నలుగురు కొత్త మంత్రుల్లో అలీ సబ్రీ కూడా ఉన్నారు. శ్రీలంక ప్రస్తుతం చరిత్రలో అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇంధనం, వంటగ్యాస్, నిత్యావసరాల కొరత, గంటల తరబడి కరెంటు కోతలతో ప్రజలు నెలల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలావుండగా, శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే పాలక కూటమి పార్లమెంట్‌లో మెజారిటీ కోల్పోయింది. ఆర్థిక సంక్షోభంపై పెరుగుతున్న అశాంతి మధ్య కనీసం 41 మంది శాసనసభ్యులు కూటమి నుండి వాకౌట్ చేయడంతో శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే పాలక కూటమి మంగళవారం పార్లమెంటులో మెజారిటీని కోల్పోయింది.
