ఎముకలు కొరికే చలితో అగ్రరాజ్యం గజగజ వణికిపోతోంది. తీవ్ర హిమపాతంతో మధ్య పశ్చిమ ప్రాంతంలో చలి ప్రమాదకరస్థాయికి చేరింది. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వీస్తోన్న చలి కారణంగా చాలా చోట్ల ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కంటే కిందకు పరడిపోయాయి.

దట్టమైన హిమపాతం కారణంగా రహదారులు, ఇళ్లు, చెట్లు మంచుతో కూరుకుపోయాయి. విస్కాన్సిన్ ప్రాంతంలో చలి తీవ్రత మరింత తీవ్రంగా ఉంది. గత కొన్నేళ్లలో ఇదే అత్యంత తీవ్రమైన హిమపాతమని వాతావరణ శాఖ తెలిపింది.

దీని వల్ల దాదాపు తొమ్మిది కోట్ల మంది ప్రజలు చలితో ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఉత్తర మిన్నెసోటా, డకోటాల్లో -50 డిగ్రీలు, ఇల్లీనాయిస్, గ్రేట్ లేక్స్, మిన్నెపోలీస్, డెట్రాయిట్, షికాగో తదితర ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

హిమపాతం కారణంగా అమెరికాలో వెయ్యికి పైగా విమానాలను రద్దు చేశారు. విస్కాన్సిన్, మిన్నెసోటీ వర్సీటీలకు సెలవులు ప్రకటించారు. రోడ్డుపై పేరుకుపోతున్న మంచుని అధికారులు యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నారు. మరోవైపు  శీతల గాలుల ధాటికి జనం బయటికి రావాలంటేనే జంకుతున్నారు.

శరీర ఉష్ణోగ్రతలు పడిపోతాయని, శరీరం మొత్తాన్ని దుస్తులతో కప్పివుంచాలని వైద్యులు సూచిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే శరీరంలో చలనం లేకపోవడం, మతి తప్పే అవకాశాలు సైతం ఉంటాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

శీతల గాలుల కారణంగా ఇప్పటి వరకు దాదాపు 8 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో నయాగారా జలపాతం గడ్డకట్టుకుపోయింది. నది ప్రవాహం సైతం నిలిచిపోయింది. వృద్ధులు, పిల్లల కోసం ప్రభుత్వం పలు చోట్ల 200కు పైగా వార్మింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది. బస్సులను కదిలే వార్మింగ్ సెంటర్లుగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు.