ఎయిర్ ఏషియాకు (AirAsia) చెందిన విమానం (నెం. AK5748) మలేషియా రాజధాని కౌలాలంపూర్ (Kuala Lumpur) నుంచి తవావుకు బయల్దేరింది. ఆకాశంలో కొంత దూరం వెళ్లాకా ప్రయాణికులు, సిబ్బంది కేబిన్ గుండా కదులుతున్న ఓ పామును గుర్తించారు.
ఇంట్లోనో, రోడ్డు మీదనో పాము కనిపిస్తే చాలు మనకి గుండె ఆగినంత పనవుతుంది. వెంటనే పరుగులు తీసేస్తాం. బస్సులోనో, కారులోనో పాము కనిపిస్తే ఆపేసి దిగిపోవచ్చు. మరీ గాల్లో.. కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న విమానంలో అలాంటి ఘటన చోటుచేసుకుంటే. వినడానికే వెన్నులో వణుకు పుడుతోంది కాదు. ముందుకొస్తే నుయ్యి.. వెనకొస్తే గొయ్యి అన్నట్టుగా వుంటుంది అందులో వున్న వారి పరిస్థితి. అచ్చం అలాంటి అరుదైన సంఘటనే, ఓ విమానంలో చోటు చేసుకుంది. దాంతో కొన్ని గంటల పాటు ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు.
వివరాల్లోకి వెళితే.. ఎయిర్ ఏషియాకు (AirAsia) చెందిన విమానం (నెం. AK5748) మలేషియా రాజధాని కౌలాలంపూర్ (Kuala Lumpur) నుంచి తవావుకు బయల్దేరింది. ఆకాశంలో కొంత దూరం వెళ్లాకా ప్రయాణికులు, సిబ్బంది కేబిన్ గుండా కదులుతున్న ఓ పామును గుర్తించారు. అంతే అది లోపలికి వచ్చేస్తుందేమోనని ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పైలట్.. ప్రయాణికుల భద్రతే ముఖ్యమని భావించి విమానాన్ని వెనక్కి మళ్లించారు.
అప్పటి వరకు ప్రయాణీకులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడిపారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఈ ఘటనపై చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కెప్టెన్ లియోంగ్ టియన్ లింగ్ మాట్లాడుతూ ఇది అరుదైన సంఘటనగా అభివర్ణించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని ఆయన చెప్పారు. అయితే పాము ఫ్లైట్‌లోకి ఎలా ప్రవేశించిందనే దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా ప్రయాణికుడు దానిని తమ వెంట తీసుకెళ్లాడా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.
