ఇండోనేషియాలో 62 మంది ప్రయాణీకులతో ఇటీవల అదృశ్యమైన విమానం సముద్రంలో కూలిపోవడం ప్రపంపాన్ని విషాదంలో ముంచింది. ఈ ఘోర ప్రమాదంలో మృతులు, విమాన శకలాలను గుర్తించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.

ప్రమాదానికి గురైన శ్రీవిజయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఫ్లైట్ నుంచి విడిపపోయిన కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ కోసం డైవర్లు థౌజండ్ ఐలాండ్‌లోని జావా సముద్ర తీర ప్రాంతాల్లో గాలింపును మరింత ముమ్మరం చేశారు.

ఈ క్రమంలో మంగళవారం బ్లాక్ బాక్స్ దొరికింది. ఇప్పటికే కొన్ని విమాన శకలాలు, మానవ అవశేషాలను కూడా సహాయక సిబ్బంది గుర్తించారు. దీంతో సముద్ర తీరంలో రెస్క్యూ ఆపరేషన్‌ను పెంచారు.

గాలింపు చర్యల కోసం 4,100 మంది సిబ్బంది, 13 హెలికాఫ్టర్లు, 55 ఓడలు, 18 రాఫ్ట్ బోట్‌లను రంగంలోకి దించినట్లు నేవీ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 141 మావన అవశేషాలతో కూడిన బ్యాగులను ధ్రువీకరణ కోసం పంపారు.

బాధితుల గుర్తింపు కోసం ప్రభుత్వం హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయడంతో బాధితుల కుటుంబసభ్యులు డీఎన్ఏ శాంపిల్స్ అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఫ్లైట్ అటెండెంట్, ఆఫ్ డ్యూటీ పైలట్ సహా ఆరుగురి మృతదేహాలను గుర్తించారు.

అటెండెంట్ బిస్మా అంత్యక్రియలను గురువారం నిర్వహించారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు ప్రమాదానికి గురైన విమానాన్ని నడిపిన ఇద్దరు పైలట్లకు విశేష అనుభవం వుందని శ్రీవిజయ ఎయిర్‌లైన్స్ తెలిపింది.

కెప్టెన్ అఫ్వాన్ ఎయిర్‌ఫోర్స్ హెర్క్యులెస్ పైలట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారని, కొన్ని దశాబ్ధాల అనుభవం ఆయనకు వుందని. అలాగే కో పైలట్‌ డియాగో మమహిట్‌కు కూడా అంతే అనుభవం వుందని వెల్లడించింది.