Asianet News TeluguAsianet News Telugu

పాలపుంత బయట తొలిసారిగా గుర్తించిన గ్రహం.. బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతూ...

భూమిలాంటి గ్రహం కోసం, గ్రహాంతర వాసుల కోసం అన్వేషణ ఎప్పుడూ ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటి వరకు గ్రహాల అన్వేషణలో మనం సౌరకుంటుంబం ఉన్న పాలపుంత గెలాక్సీని దాటిపోలేదు. కానీ, తొలిసారిగా పాలపుంత వెలుపల ఒక గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అది శనిగ్రహం పరిమాణంలో ఉన్నదని, ఓ బ్లాక్ హోల్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నదని వివరించారు.
 

scientists discovered first planet outside milky way
Author
New Delhi, First Published Oct 26, 2021, 3:03 PM IST

న్యూఢిల్లీ: ఖగోళం అంటేనే అంతులేని రహస్యాలకు నెలవు. ప్రతి చిన్న విషయమూ అబ్బురపరుస్తుంటుంది. Spaceలో వెలుగులోకి వచ్చే ప్రతి అంశమూ ఇప్పటి విజ్ఞానానికి సవాల్ విసురుతూ ఉంటుంది. విశ్వాన్ని ఊహించుకుంటే.. అందులో ఎన్నో Galaxyలు.. అందులోనూ మనలాంటి సౌర కుటుంబాలెన్నో.. గ్రహాలు.. ఉపగ్రహాలు ఇలా ఎంతో ఆసక్తిగా తోస్తుంది. మన సౌర కుటుంబంలో ఇతర గ్రహాలతోపాటు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇలాంటి కుటుంబాలను కలిపి ఒక గెలాక్సీగా పేర్కొంటారు. మన గెలాక్సీ పాలపుంత(Milky Way).

మనిషి జీవించడానికి లేదా భూమికి సారూప్యమైన గ్రహాల కోసం మన శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి అన్వేషణ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు పాలపుంతలోనే నాలుగు వేల గ్రహాలను కనుగొన్నారు. ఇందులో కొన్ని భూమిని పోలినవి, కొన్ని జూపిటర్‌ను పోలిన గ్రహాలున్నాయి. కొన్ని రోదసి సంబంధ సవాళ్లతో నశించిపోతున్నవీ ఉన్నాయి. ఇవన్నీ భూమి నుంచి రమారమి మూడు వేల కాంతి సంవత్సరాల(ఒక సంవత్సరకాలంలో కాంతి ప్రయాణించే దూరమే.. కాంతి సంవత్సరం) దూరపరిధిలోనే ఉన్నాయి. కానీ, తాజా అన్వేషణ తొలిసారి పాలపుంతను దాటింది. అంటే, 28 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో పాలపుంత బయట ఎం51 అనే Planetను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది Saturn సైజులో ఉన్నట్టు తెలిపారు. ఓ Black Hole చుట్టూ తిరుగుతున్నట్టు వివరించారు. నాసాకు చెందిన చంద్ర ఎక్స్ రే అబ్జర్వేటరీ సహాయంతో వర్ల్‌పూల్ గెలాక్సీలోని ఈ ప్లానెట్‌ను కనుగొన్నారు.

Also Read: ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ప్రారంభించిన ప్రధాని.. ‘ఖగోళ యుగంలో భారత్ వెనుకబడదు’

ఎక్స్ రే వేవ్‌లెంగ్త్స్ ఆధారంగా గ్రహాలను కనుగొంటున్నామని, దీని ద్వారా ఇతర గెలాక్సీల్లోని గ్రహాలను కనుగొనడం సులవవుతుందని భావిస్తున్నట్టు సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్త రొసానీ డిస్టెఫానో వివరించారు. భూమిపైన, అంతరిక్షంలోని టెలిస్కోపుల సహాయంతో శాస్త్రవేత్తలు సుదూర తీరాల నుంచి వెలువడుతున్న కాంతలను పరిశీలిస్తున్నారు. ఎక్స్ రే కిరణాల బ్రైట్‌నెస్‌ ద్వారా గ్రహాలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా వర్ల్‌పూల్ గెలాక్సీ నుంచి వచ్చిన ఆ ఎక్స్ రేలను పరిశీలించి ఈ మేరకు అంచనా వేశారు.

నక్షత్రం నిరంతరం కాంతిని వెదజల్లుతూ ఉంటుంది. ఆ Star నుంచి వచ్చే కాంతి కొంత కాలం నిలిచిపోయిందంటే దాని ముందు నుంచి ఏదో వస్తువుకు వెళ్తున్నట్టు అర్థం చేసుకోవాలి. ఇదే సూత్రం ఆధారంగా ఎక్స్ రే కిరణాలు పరిశీలించారు. ఇందులో తేడాను కనీసం ఒక మూడు గంటలపాటు కనుగొన్నారు. అంటే ఆ కాలంలో గుర్తించిన గ్రహం ఒక నక్షత్రం ముందు నుంచి కదిలి వెళ్లిపోయినట్టు భావిస్తున్నారు. వీటి ఆధారంగానే ఆ గ్రహం శనిగ్రహం సైజులో ఉండవచ్చని వివరిస్తున్నారు. ఈ గ్రహం ఒక భారీ బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతున్నట్టు తెలిపారు.

‘దురదృష్టవశాత్తు.. ఈ గ్రహాన్ని మరోసారి ధ్రువీకరించడానికి దశాబ్దాలు పట్టవచ్చు. ఎందుకంటే ఆ గ్రహం ఒకసారి దాని కక్ష్యను పూర్తి చేసుకోవడానికి ఎంత కాలం పడుతుందో మనకు తెలియదు. కాబట్టి, ఆ గ్రహాన్ని మరోసారి చూడటానికి ఎంత కాలం పడుతుందో చెప్పలేం’ అని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకురాలు నియా ఇమారా వివరించారు. 

Also Read: spaceX: మూడు రోజులు రోదసిలో పర్యటించి సురక్షితంగా పుడమి చేరుకున్న యాత్రికులు

ఒకవేళ అక్కడ నిజంగా ఒక గ్రహంగా ఉండిఉంటే దాని చరిత్ర బీభత్సంగా ఉంటుందని అస్ట్రానామర్లు చర్చిస్తున్నారు. అక్కడి బ్లాక్ హోల్ లేదా న్యూట్రాన్ స్టార్‌ ఏర్పడటానికి భారీ విస్ఫోటనం జరిగి ఉంటుందని, దాన్ని ఎదుర్కొని ఆ గ్రహం నిలబడి ఉండాలని వివరించారు. అంతేకాదు, బ్లాక్ హోల్‌తోపాటుగా కదులుతున్న మరో నక్షత్రం కూడా త్వరలోనే విస్ఫోటనం చెందే అవకాశముంటుందని, తద్వారా ఆ గ్రహం ఇంకో విపత్తుకూ లోనుకావాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios