రష్యాలో జరుగుతున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్ లో పాల్గొన్న సౌదీ అరెబియా జట్టు సభ్యులు ఫెను ప్రమాదం నుండి తప్పించుకున్నారు.  వీరు ప్రయాణిస్తున్న ఎయిర్‌బస్ విమానం ప్రమాదంలో చిక్కుకుంది. అయితే ఈ ప్రమాదం నుండి ఆటగాళ్లతో పాటు సిబ్బంది కూడా సురక్షితంగా బైటపడ్డారు. 

వరల్డ్ కప్ లో భాగంగా సౌదీ ఆటగాళ్లు ఓ ప్రత్యేక విమానంలో రష్యాలోని రాస్తోక్ కు వెళుతుండగా విమానంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. విమానం ఆకాశంలో ఉండగానే ఓ ఇంజన్ లో మంటలు చెలరేగాయి. దీంతో ఆటగాళ్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

అయితే దీన్ని గమనించిన ఫైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీంతో విమానంలోని ఆటగాళ్లు, సిబ్బంది ఫెను ప్రమాదం నుండి తప్పించుకున్నారు.

ఈ ప్రమాదంపై రష్యా ఎయిర్‌లైన్స్‌ అధికారులు స్పందించారు. ఏదైనా పక్షి ఢీకొనడం వల్లే ఇలా మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై విచారణ జరిపి తదుపరి వివరాలు తెలియజేస్తామని ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపారు.