ఐఎంఈఈసీలో సౌదీ, ఇజ్రాయెల్‌ల భాగస్వామ్యం పాలస్తీనాకు కలిసివచ్చేనా?
సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌ల మధ్య సత్సంబంధాల కోసం అమెరికా దీర్ఘకాలంగా ప్రయత్నాలు చేస్తున్నది. అయితే.. మొన్నటి ఢిల్లీ జీ 20 శిఖరాగ్ర సదస్సులో ఏర్పడిన ప్రధానమైన ఐఎంఈఈసీ ఒప్పందానికి సంబంధించి ప్రాజెక్టు దీనికి దోహదపడనున్నది. అంతేకాదు, వీటి మధ్య సంబంధాలు పరోక్షంగా పాలస్తీనాకూ ఊరటనివ్వొచ్చని చెబుతున్నారు.

న్యూఢిల్లీ: ఇటీవలే ఢిల్లీలో జరిగిని జీ 20 శిఖరాగ్ర సదస్సులో ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్(ఐఎంఈఈసీ) ప్రాజెక్టు గురించి ప్రధానమైన ప్రకటన వెలువడింది. ఈ ప్రాజెక్టు ఒప్పందంపై భారత్, అమెరికా, సౌదీ అరేబియా, యూఏఈ, యూరోపియన్ యూనియన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీలు సంతకం పెట్టాయి. ఇది భారత్ నుంచి యూరప్‌కు ఆ తర్వాత యూఎస్‌లను కలిపేసే మార్గానికి సంబంధించినది. ఈ మార్గం అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌ల మీదుగా సాగుతుంది. ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ ప్రధాన లక్ష్యం ఏమిటంటే.. భాగస్వామ్య దేశాల ఆర్థిక వృద్ధి, వాటి శక్తి సామర్థ్యాలను పెంపొందించడం. ఇది కీలకమైన పరిణామం.
ఈ ప్రాజెక్టులో భాగంగా గూడ్స్‌ను తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో భారత్ నుంచి యూరప్‌కు డెలివరీ చేయడం వీలవుతుంది. భారత పశ్చిమ తీర పోర్టులు (ముంద్రా, కాండ్లా, నవీ ముంబయి) నుంచి యూఏఈ (జెబెల్ అలీ, ఫుజైరాహ్) పోర్టులకు గూడ్స్ వెళ్లుతాయి. ఆ తర్వాత సౌదీ అరేబియా నుంచి జోర్డాన్ వరకు రైల్ మార్గంలో గూడ్స్ వెళ్లుతాయి. ఈ రైలు మార్గం ఇజ్రాయెల్ పోర్టు హైఫా వరకు సాగుతుంది. అక్కడి నుంచి సమీప గ్రీస్‌లోని పైరాస్ పోర్టుకు సరుకులు చేరుతాయి.
ఈ ప్రాజెక్టు కోసం సౌదీ నుంచి ఇజ్రాయెల్ వరకు సమర్థవంతమైన రైల్ నెట్‌వర్క్ అవసరం. ఇది సంబంధ దేశాల్లో మౌలిక వసతులు, అభివృద్ధికి దోహదపడుతాయి. ఈ ప్రాజెక్టు సమగ్ర ప్రణాళిక అక్టోబర్‌లో విడుదలవుతుందని ఈయూ వెల్లడించింది.
ఇంజినీరింగ్ ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఈఈపీసీ ఇండియా) చైర్మన్ అరుణ్ కుమార్ గొరాడియా ఈ ప్రాజెక్టును గేమ్ చేంజర్ అని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత గూడ్స్ సూయజ్ కెనాల్ గుండా వెళ్లుతున్నది. 2021లో సూయజ్ కెనాల్ బ్లాక్ అయినప్పుడు ఆరు రోజులపాటు సప్లై చైన్ నిలిచిపోయింది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దెబ్బ వేసింది. రోజుకు 400 మిలియన్ల డాలర్ల చొప్పున నష్టం వాటిల్లినట్టు లాయిడ్స్ పేర్కొంది.
Also Read: Food Poison: ఎగ్ ఫ్రైడ్ రైస్ తిని తిరుపతిలో యువకుడు మృతి.. షాప్‌లో పోలీసుల తనిఖీలు
యూరప్‌కు గూడ్స్ ఎగుమతి చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాల కోసం భారత్ చూస్తున్నది. ఇందులో భాగంగానే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్‌లో పాల్గొంది.
ఇటీవలే అబ్రహం ఒప్పందానికి మూడేళ్లు నిండాయి. ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ల మధ్య సాధారణ సంబంధాలు నెలకొల్పడం ఈ ఒప్పంద ప్రధాన లక్ష్యం. ఆ తర్వాత బహ్రెయిన్, మొరాకాతోనూ ఇజ్రాయెల్‌కు సాధారణ సంబంధాల నెలకొనాలి. ఈ ఒప్పందం ఐఎంఈఈసీ ప్రాజెక్టుకు కీలకంగా దోహదపడింది. దీని వల్లే భారత్, ఇజ్రాయెల్, యూఏఈల మధ్య ట్రైరీజియనల్ రీఆర్డర్ సాధ్యమవుతున్నది.
ప్రస్తుతం ఈ రీజియన్‌లో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో చైనా ప్రమేయం ఉన్నది. ఇందులో ఇజ్రాయెల్ కూడా ఉన్నది. అయితే.. భారత్ జోక్యం చైనాను మూలకు నెట్టేసే పరిస్థితి ఏమీ లేదు. కానీ, ఈ రీజియన్‌లో సంతులనానికి, భారత కంపెనీలకు ఇది ఉపయోగకారిగా ఉంటుంది. ఎందుకంటే భారత్ మార్కెట్‌కు మిడిల్ ఈస్ట్, యూరప్ కీలకమైనవి. ఈ ప్రత్యామ్నాయ మార్గం ద్వారా అంతర్జాతీయంగా పోటీతత్వానికి ఆస్కారం ఉంటుంది. ఈ కార్యక్రమాల వల్ల ఆర్థిక వృద్ధితోపాటు ఉపాధి కల్పన, కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా తగ్గించడానికి వీలవుతుంది.
ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇది సౌదీ 2030 విజన్‌ను సాకారం చేసేదిగా ఉన్నది. యూఏఈ గ్లోబల్ ట్రాన్సిట్, లాజిస్టికల్ హబ్‌గా మారాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. మరో ముఖ్య అంశం ఈ ప్రాజెక్టు ద్వారా లభించేది ఏమంటే.. ఇది సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌ల మధ్య సహకారాన్ని కోరుతుంది. ఈ రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాల కోసం అమెరికా కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నది. ఇలాంటి నార్మలైజేషన్‌లో పాలస్తీనాను కూడా భాగం చేయాలంటే సౌదీ అరేబియా కొన్నింటిని భరించాల్సి ఉంటుంది. కొన్ని రాయితీను ఇవ్వాల్సి ఉండొచ్చు. ఐఎంఈఈసీ విజయవంతం అయితే.. పరోక్షంగా పాలస్తీనాకు మంచి భవిష్యత్‌ను ఊహించవచ్చు.