ఉక్రెయిన్‌లోని ఓ రైతు యుద్ధ ట్యాంక్‌ను తన ట్రాక్టర్‌కు కట్టేసుకుని లాక్కెళ్లాడు. అక్కడే నిలుచున్న ఓ వ్యక్తి దాని వెంట పరుగులు తీశాడు. ఏడు సెకండ్ల ఈ వీడియోను సోషల్ మీడియాలో ఇప్పటి వరకు 46 లక్షల మంది వీక్షించారు.

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌(Ukraine) పై రష్యా (Russia) దాడులను సాధారణ పౌరులు అసాధారణంగా ఎదుర్కొంటున్నారు. ఉత్పాతాల సమయంలో సామాన్యులే అసామాన్యులుగా మారతారన్న మాటలు నిజం చేస్తూ ఉక్రెయిన్ పౌరులు శాయశక్తుల రష్యా సేనల (Military Operation) ను అడ్డుకుంటున్నారు. ఓ పౌరుడు రష్యా మిలిటరీ కాన్వాయ్‌ (Military Convoy) కు అడ్డంగా వెళ్లి అడ్డుకోగా.. మరో పౌరుడు రష్యా యుద్ధ ట్యాంక్‌ (War Tank)ను ఖాళీ చేతులతో అడ్డుకున్నాడు. ఆ తర్వాత దాని ఎదురుగా మోకాళ్లపై కూర్చుని ఆ ట్యాంకు ముందుకు కదిలే వీలే లేదని స్పష్టం చేస్తున్నట్టుగా వ్యవహరించాడు. ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వీడియోనూ మరొకటి కూడా చక్కర్లు కొడుతున్నది.

సాధారణ ఉక్రెయిన్ పౌరులు రష్యా యుద్ధ ట్యాంకులను దీటుగా నిలబడి ఆపుతున్నారు. తాజాగా, ఓ రైతు ఏకంగా రష్యా సైన్యానికి సవాల్ విసిరారు. యుద్ధ ట్యాంకును తన ట్రాక్టర్‌కు కట్టుకుని పొలోమని లాక్కెళ్లాడు. ఆ యుద్ధ ట్యాంక్‌ను రైతు దొంగిలించుకు వెళ్తుండగా అది చూస్తున్న ఓ వ్యక్తి దాని వెనుక అప్రయత్నంగా పరుగులు తీశాడు. ఏడు సెకండ్ల నిడివి గల ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషనల్ అవుతున్నది. ఈ వీడియోను ఇప్పటి వరకు సుమారు 46 లక్షల మంది వీక్షించారు.

ఈ వీడియోను బ్రిటీష్ కన్జర్వేటివ్ పొలిటీషియన్ జానీ మెర్సర్ ట్వీట్ చేశారు. ఉక్రెయిన్ అంబాసిడర్‌గా పని చేసిన ఒలెక్సాండర్ షెర్బా సహా మరికొందరు అంతర్జాతీయ ప్రముఖులు ఈ వీడియోను షేర్ చేశారు.

Scroll to load tweet…

ఉత్తర ఉక్రెయిన్‌లోని బక్మాచ్ నగర వీధుల్లో ఎవరూ ఊహించిన ఘటన జరిగింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మూడో రోజుకు చేరిన శనివారం నాడు ఈ ఘటన చోటుచేసుకుంది. చైన్‌ల ఆధారంగా నడిచే యుద్ధ ట్యాంకు మెల్లగా ముందుకు కదులుతుండగా అనూహ్యంగా ఓ ఉక్రెయిన్ పౌరుడు దానికి అడ్డుగా వచ్చాడు. తన రెండు చేతులను యుద్ధ ట్యాంకుకు ఆనించి బలంగా దాన్ని ఆపే ప్రయత్నం చేశాడు. ముందుకు కదలుతున్న ఆ యుద్ధ ట్యాంకు ఆ పౌరుని చర్య వల్ల నెమ్మదించింది. చివరికి ఆ ట్యాంకు కదలకుండా నిలిచిపోయింది.

ఆ యుద్ధ ట్యాంకు నిలవగానే ఆ పౌరుడు దానికి కొంత దూరంగా వెళ్లి ఎదురుగానే మోకాళ్లపై కూర్చున్నాడు. ఇక్కడి నుంచి ఆ ట్యాంకు కదిలితే.. తన మీది నుంచే వెళ్లాలి అన్నట్టుగా కూర్చున్నాడు. ఇదంతా చూస్తున్న స్థానికులు వెంటనే ఆయన దగ్గర పరుగున ఉరికి వచ్చారు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ వీడియోతో పాటు ఓ వ్యాఖ్యానాన్నీ జోడించింది. ఉక్రెయిన్ దేశం పౌరులను నిర్బంధంలో ఉంచుతున్నదని రష్యా కొన్నేళ్లుగా అబద్ధాలు చెబుతున్నదని పేర్కొంది. కానీ, వాస్తవం ఏమిటంటే.. ఉక్రెయిన్ పౌరులంతా స్వేచ్ఛగా ఉన్నారని వివరించింది. ఇప్పుడు వారే రష్యా యుద్ధ ట్యాంకులను అవసరమైనప్పుడు ఖాళీ చేతులతో అడ్డుకుంటున్నారని క్యాప్షన్ పోస్టు చేసింది.