ఉక్రెయిన్ అధ్యక్షులు వొలొడిమిర్ జెలెన్‌స్కీ తనను, తన కుటుంబాన్ని నిర్బంధించడానికి రష్యా ట్రూపులు చాలా సమీపంగా వచ్చాయని వివరించారు. రష్యా దాడి ప్రారంభించిన తొలినాళ్లలోనే తనపై టార్గెట్ ఎక్కవుగా ఉండిందని తెలిపారు. ఆ తొలి రోజు నాటి క్షణాలను ఆయన ఓ మీడియా సంస్థకు వెల్లడించారు.
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా ఫిబ్రవరి 24వ తేదీన యుద్ధం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. తొలినాళ్లలో ఈ దాడులు విధ్వంసం తీవ్రంగా సాగింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పైనే ప్రధానంగా ఫోకస్ ఉండేది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీపైనా టార్గెట్ ఉండేది. అప్పటికే పలుమార్లు ఆయనను హతమార్చడానికి కుట్రలు జరిగాయని, అవి విఫలం అయ్యాయని మీడియా కథనాలు వెలువరించిన సంగతి తెలిసిందే. తాజాగా, టైమ్ మ్యాగజిన్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ వొలొడిమిర్ జెలెన్‌స్కీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. రష్యా ట్రూపులు తనను, తన కుటుంబాన్ని నిర్బంధించడానికి చాలా దగ్గరగా వచ్చాయని తెలిపారు.
ఉక్రెయిన్‌పై దాడి మొదలైన ఫిబ్రవరి 24వ తేదీని ఆయన గుర్తు చేశారు. ఆ రోజు జ్ఞాపకాలు శకలాలుగా ఇంకా తన మదిలో ఉన్నాయని వివరించారు. ఆ రోజు ఉదయం తాను, తన భార్య ఒలెనా జెలెన్‌స్కా ఉదయాన్నే బాంబుల చప్పుడుకు లేచామని తెలిపారు. తమ 17 ఏళ్ల కూతురు, 9 ఏళ్ల కుమారుడిని తాము నిద్ర నుంచి లేపామని వివరించారు. బాంబుల మోత మొదలైందని పేర్కొన్నారు.
ఆ బాంబుల మోత చాలా బిగ్గరగా వినిపించాయని, చాలా పేలుళ్లు జరుగుతున్నాయని జెలెన్‌స్కీ చెప్పారు. ఆ వెంటనే తమకు ఒక విషయం అర్థం అయిందని, రష్యా ట్రూపులు ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయాన్ని టార్గెట్ చేసుకున్నాయని స్పష్టం అయిందని తెలిపారు. కాబట్టి, ఈ కార్యాలయాలు సురక్షితం కాదనే అభిప్రాయానికి వచ్చామని చెప్పారు. అదే సమయంలో తమకు ఒక సందేశం వచ్చిందని అన్నారు. తననున, తన కుటుంబాన్ని నిర్బంధించడానికి రష్యా స్ట్రైక్ టీమ్‌లు ప్యారాచూట్ ద్వారా కీవ్ నగరంలో దిగుతున్నాయని సమాచారం వచ్చిందని తెలిపారు.
జెలెన్‌స్కీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రియ్ యెర్మాక్ టైమ్ సంస్థతో మాట్లాడుతూ ఇలాంటి ఘటన తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని, అలాంటి సన్నివేశాలు కేవలం సినిమాల్లోనే కనిపిస్తాయని అన్నారు. అధ్యక్ష భవనాన్ని రక్షించడానికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. అధ్యక్ష భవనం వెనుక గేటును పూర్తిగా మూసేశామని తెలిపారు. పెద్ద సంఖ్యలో పోలీసు బారికేడ్లతో దాన్ని నింపేశామని, ప్లైవుడ్ బోర్డులనూ అందుకు వినియోగించామని వివరించారు. అది చూస్తే.. పటిష్టమైన కోటలాగా కాకుండా.. ఓ చెత్త కుప్పలా కనిపించిందని పేర్కొన్నారు. రష్యా దాడి చేసిన తొలి రోజున లైట్లను ఆర్పేశామని, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, శతజ్ఞులను జెలెన్‌స్కీ, ఆయన ఆంతరంగికులకు అందించామని వివరించారు.
