Asianet News TeluguAsianet News Telugu

రష్యా సైనికుడికి ఉక్రెయిన్ కోర్టు శిక్ష.. పౌరుడిని చంపినందుకు జీవిత ఖైదు

రష్యా సైనికుడు యుద్ధ నేరానికి పాల్పడ్డాడని ఉక్రెయిన్ కోర్టు శిక్ష విధించింది. ఈశాన్య ఉక్రెయిన్‌లోని ఓ గ్రామంలో 62 ఏళ్ల నిరాయుధుడైన పౌరుడిని అంతమొందించాడని రష్యా సైనికుడు అంగీకరించాడు. ఆయనకు జీవిత ఖైదు శిక్ష విధించింది.
 

russia soldier pleaded guilty in murder of ukraine civilian
Author
New Delhi, First Published May 23, 2022, 4:49 PM IST

న్యూఢిల్లీ: ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్ దేశంపై రష్యా దాడి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌లో ఆయుధ సంపత్తి పెరిగిందని, ఆ సంపత్తిని, నియో నాజీయిజాన్ని అంతమొందించడానికి మిలిటరీ ఆపరేషన్ చేపడుతున్నట్టు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. తమ లక్ష్యం కేవలం ఉక్రెయిన్ మిలిటరీ బేస్‌లేనని, ఉక్రెయిన్ పౌరులు తమ లక్ష్యం కాదని తెలిపారు. కానీ, మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత పలుచోట్ల ఉక్రెయిన్ సాధారణ పౌరులూ దుర్మరణం చెందారు. అదీగాక, రష్యా సైన్యం.. ఉక్రెయిన్ సాధారణ పౌరులపైనా దాష్టీకాలు చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. వీటిని ఉక్రెయిన్ యుద్ధ నేరాలుగా ప్రకటించింది.

ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌లో యుద్ధ నేరానికి పాల్పడ్డాడని పేర్కొంటూ ఓ రష్యా సైనికుడికి ఉక్రెయిన్ కోర్టు శిక్ష విధించింది. ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించినట్టు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. 21 ఏళ్ల రష్యా సైనికుడు వాదిమ్ షిషిమారిన్ ట్యాంక్ కమాండర్. ఈశాన్య ఉక్రెయిన్‌లో 62 ఏళ్ల వృద్ధుడిని ఫిబ్రవరి 28న చంపేసినట్టు వాదిమ్ షిషిమారిన్ అంగీకరించినట్టు కోర్టు తెలిపింది. చుపఖివ్కా గ్రామంలో ఆ వృద్ధుడిని చంపేయాలని ఆదేశాలు రాగానే.. చంపేసినట్ట షిషిమారిన్ అంగీకరించాడని సమాచారం.

ఇదిలా ఉండగా, రష్యాలోకి ప్రవేశించకుండా శాశ్వత నిషేధం విధించిన జాబితాను ఆ దేశం ఇటీవలే అప్‌డేట్ చేసింది. ఈ జాబితాలో కొత్తగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేరును రష్యా చేర్చింది. జో బైడెన్‌తోపాటు ఫేస్‌బుక్ చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్, హిల్లరీ క్లింటన్‌ పైనా రష్యా నిషేధం విధించింది. కానీ, అనూహ్యంగా డొనాల్డ్ ట్రంప్‌ పై నిషేధం విధించలేదు. 

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన వ్లాదిమిర్ పుతిన్‌పై ఎలాంటి విమర్శలు చేయలేదు. ఆయన సొంత ఇంటెలిజెన్స్ అభిప్రాయాలను సైతం పక్కనబెట్టి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై బహిరంగంగా ప్రశంసలు కురిపించారు. పుతిన్‌కు వ్యతిరేకంగా ఆయన పెద్దగా చర్యలు తీసుకోలేదు. వీలైనంత వరకు ఆయనకు అనుకూలంగానే వ్యవహరించాడు.

అమెరికా ప్రముఖులపై రష్యా నిషేధాజ్ఞలు విధించడాన్ని పశ్చిమ దేశాలపై అది తీసుకున్న కౌంటర్ యాక్షన్‌గా చూస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని అమెరికా సహా యూరప్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అంతేకాదు, రష్యాను కట్టడి చేయడానికి ఆ దేశంపై అమెరికా, పశ్చిమ దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించాయి. కానీ, రష్యా మాత్రం వెనుకడుగు వేయలేదు. 

ఈ ఆంక్షలకు ప్రతీకారంగానే రష్యా ప్రభుత్వం అమెరికా ప్రముఖులపై నిషేధాజ్ఞలు విధించినట్టు తెలుస్తున్నది. తాజా చేర్పుతో ఈ జాబితా 963 మందికి చేరింది. వీరంతా రష్యాలోకి శాశ్వతంగా ప్రవేశించలేరు.

Follow Us:
Download App:
  • android
  • ios