Russia Ukraine Crisis: మూడవ రోజు కూడా ఉక్రెయిన్‌పై రష్యా దళాలు భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ ప్రధాన నగరాలను టార్గెట్ చేస్తూ.. బాంబుల వర్షాన్ని కురుపిస్తున్నాయి.ఈ తరుణంలో మెలిటోపోల్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నామని రష్యా ప్రకటించింది.
Russia Ukraine Crisis: మూడవ రోజు కూడా ఉక్రెయిన్‌పై రష్యా దళాలు భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్టు రష్యా బలాగాలు ఉక్రెయిన్ ప్రధాన నగరాలను టార్గెట్ చేస్తూ.. బాంబుల వర్షాన్ని కురుపిస్తున్నాయి. సైనిక దాడులు, బాంబుల దాడి మోత, వైమానిక దాడులు మోగుతున్న సైరన్ల మధ్య రాజధాని కీవ్ నగరం చిగురుటాకులా వణికిపోతుంది. యుద్దాన్ని తక్షణమే నిలిపివేయాలని ప్రపంచదేశాలు కోరుతున్నా..రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ ఏ మాత్రం తగ్గడం లేదు. యుద్ధ ట్యాంకర్లు నగరంపై దాడి చేస్తుంటే.. ఉక్రెయిన్ సైన్యం గెరిల్లా యుద్దం చేస్తూ.. రష్యా బలగాలను నిలువరిస్తున్నాయి. ఏ క్షణంగా ఏం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ.. రష్యా తన దళాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని తీర్మానంలో డిమాండ్ చేస్తూ.. UN భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. కానీ రష్యా తన వీటో అధికారాన్ని ఉపయోగించింది. మండలి 15 సభ్యదేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా..ఉక్రెయిన్‌పై దండయాత్రను ఖండిస్తూ ఓటు వేశాయి. అయితే రష్యా తన వీటో అధికారంతో తీర్మానాన్ని తిరస్కరించింది. భారత్, చైనా, యూఏఈ ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. ఐక్య రాజ్య సమితిలోని భద్రతా మండలిలో అమెరికా, అల్బేనియా దేశాలు రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశ పెట్టాయి. వెంటనే ఉక్రెయిన్ నుంచి రష్యా దళాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి.
ఈ క్రమంలో రష్యా బలగాలు మెలిటోపోల్ నగరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించాయి. ఉక్రెయిన్‌పై రష్యన్ సైన్యం భీకర దాడిని చేస్తున్నాయి. మూడవ రోజు కూడా రణభేరి మోగించి.. దాడుల్ని కొనసాగిస్తోంది. ఆగ్నేయ ఉక్రేనియన్ నగరమైన మెలిటోపోల్ సిటీని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. మెలిటోపోల్ ఓ మధ్య స్థాయి నగరం. ఉక్రెయిన్‌లోని మారియోపోల్ పోర్ట్ సమీపంలో ఈ పట్టణం ఉంది.
మరోవైపు.. ఇప్పటికే రాజధాని కైవ్‌తో సహా అనేక నగరాలపై రష్యన్ దళాలు క్రూయిజ్ క్షిపణి , ఫిరంగి దాడులను చేస్తున్నాయి.
ఇవాళ కీవ్‌పై రెండు మిస్సైళ్లతో రష్యా దాడి చేసింది. కీవ్‌లోని సౌత్ఈస్ట్ ప్రాంతంపై ఇవాళ ఉదయం రెండు మిస్సైళ్లతో దాడి జరిగింది. ఈ రెసిడెన్షియల్ బిల్డింగ్‌ను మిస్సైల్ ఢీకొట్టినట్లు కీవ్ అధికారులు తెలిపారు. జులియాన్ విమానాశ్రయం వద్ద ఓ మిస్సైల్ పడినట్లు కొందరు తెలిపారు. కీవ్‌లోని పలు బిల్డింగ్ ధ్వంసమైంది. ఇక్కడే ఆ మిస్సైల్ పడినట్లు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఐక్యరాజ్యసమితి ప్రకారం, గత రెండు రోజుల్లో ఇప్పటికే 50,000 మందికి పైగా ఉక్రేనియన్లు దేశం నుండి పారిపోయారు. సుమారు 100,000 మంది బంకర్లలో తలదాచుకున్నారు. కైవ్‌లో చాలా మంది నివాసితులు తమ ఇళ్లను విడిచిపెట్టి, నగరంలోని సబ్‌వే వ్యవస్థలో ఆశ్రయం పొందారని నివేదికలు చెబుతున్నాయి.
